శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 ఆగస్టు 2023 (08:59 IST)

చంద్రయాన్ -3 ప్రయోగం : 14 రోజుల తర్వాత ల్యాండర్ ఏమౌతుంది?

vikram lander
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజవంతమైంది. ఈ ప్రయోగం సఫలంతో ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యపోయాయి. కోట్లాది మంది భారతీయులు విజయోత్సవత్సాల్లో మునిగిపోయారు. ఈ చంద్రయాన్-3లో జాబిల్లిపైకి పంపిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవల్‌లు ఇపుడు చంద్రుడి దక్షిణ ధృవం గుట్టు విప్పేందుకు పరిశోధనలు చెపట్టాయి. అయితే, వీటి జీవిత కాలం ఒక లూనార్ డే. అంటే 14 రోజులు మాత్రమే అని ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. ఆ తర్వాత అవి ఏమవుతాయన్నది ప్రతి ఒక్కరిలోనూ సందేహం నెలకొంది. దీనిపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వివరణ ఇచ్చారు.
 
చంద్రుడి ఉపరితలంపై ఒక రోజు అంటే భూమిపై సుమారుగా 29 రోజులతో సమానం. అంటే జాబిల్లి ఉపరితలంపై 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటుంది. ఈ లెక్కన ఆగస్టు 23న చంద్రుడిపై పగలు మొదలైంది. ల్యాండర్‌ను సురక్షితంగా దించాలంటే సూర్యరశ్మి అవసరం. అందుకే 23వ తేదీని సాఫ్ట్ ల్యాండ్ చేసేందుకు ఇస్రో ఎంచుకున్నది. 
 
ఒకవేళ ఏదైనా కారణంగా ల్యాండింగ్‌లో సమస్య వస్తే పూర్తిగా సూర్యరశ్మి వచ్చిన తర్వాత అంటే 24న ల్యాండ్ చేస్తామని ముందే ఇస్రో ప్రకటించింది. ల్యాండింగ్ వాయిదా వేయాల్సి వస్తే.. ఒక లూనార్ రోజు అనగా 29 రోజుల తర్వాత ల్యాండింగ్ చేయాల్సి వచ్చేది. ఈ లెక్కన పగలు ఏర్పడిన మొదటి రోజు ల్యాండ్ చేస్తేనే పూర్తిగా 14 రో జులు పరిశోధనలు చేసేందుకు వీలవుతుంది.
 
ఇపుడు జాబిల్లిపై ఉన్న విక్రమ్, ప్రజ్ఞాన్ పూర్తిగా సూర్యరశ్మి ఆధారంగా పని చేస్తాయి. జాబిల్లిపై రాత్రయితే సుమారు 180 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. అందుకే చంద్రుడిపై పగలు ఉండే 14 రోజులే వీటి జీవితకాలం అని ఇస్రో ప్రకటించింది. ఆ తర్వాత రాత్రి అవగానే ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ల్యాండర్, రోవర్‌లోని వ్యవస్థలు పని చేయవు. 
 
ల్యాండర్, రోవర‌్‌లోని వ్యవస్థలు సూర్యరశ్మి ఆధారంగా పని చేస్తాయి కాబట్టి.. 14 రోజుల తర్వాత అవి పని చేయడం దాదాపుగా అసాధ్యం. అయితే 14 రోజుల రాత్రి తర్వాత కూడా ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడితే ల్యాండర్, రోవర్ తిరిగి పని చేసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతల కారణంగా ల్యాండర్, రోవర్ సూర్యరశ్మితో ఇంధనాన్ని తయారు చేసుకొని మళ్లీ పని చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అదే జరిగితే అవి మరో లూనార్ డే వరకు సేవలు అందిస్తాయి. అలా జరిగితే బోనస్‌గానే భావించాలి. 
 
కానీ ల్యాండర్, రోవర్ రెండూ పని చేస్తేనే భూమికి సమాచారం చేరుతుంది. రోవర్ నేరుగా భూమిపైకి సమాచారాన్ని పంపించలేదు. ఈ కారణంగానే రోవర్ పని చేసినా, ల్యాండర్ వ్యవస్థ కుప్పకూలిపోతే మిషన్ వృథా అవుతుంది. అదేసమయంలో ల్యాండర్ ఒకటే పని చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. జాబిల్లి ఉపరితలంపై చక్కర్లు కొడుతూ పరిశోధనలు చేసే రోవర్ పని చేయకపోయినా మిషన్ అక్కడితో ఆగిపోతుంది.