1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2024 (12:57 IST)

మరాఠా రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్‌కు ఈసీ డెడ్‌లైన్.. ఎందుకో తెలుసా?

ajith pawar - sharad pawar
కేంద్ర మాజీ మంత్రి, మరాఠా రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్‌కు భారత ఎన్నికల సంఘం డెడ్ లైన్ విధించింది. కొత్త పార్టీ పేరు, గుర్తుకు సంబంధించి గురువారం సాయంత్రం నాలుగు గంటలలోపు అంతిమ నిర్ణయాన్ని వెల్లడించాలేని లేనిపక్షంలో తాము ఎంపికచేసి పార్టీ పేరు, ఎన్నికల గుర్తును స్వీకరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
 
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సారథ్యంలోని వర్గమే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ - ఎన్సీపీ అని పేర్కొంటూ ఆ పార్టీ పేరుతో పాటు ఎన్నికల గుర్తును కేటాయించింది. ఆ మరుసటి రోజే కీలక పరిణామం చోటుచేసుకుంది. శరద్ పవార్ సారథ్యంలోని వర్గం పార్టీకి 'నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరచ్చంద్ర పవార్' పేరుని కేటాయించింది. త్వరలోనే మహారాష్ట్రలోని 6 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా 'వన్ టైమ్ ఆప్షన్'గా ఈ పేరుని అంగీకరించినట్టు ఎన్నికల సంఘం వివరించింది. అయితే ఎన్సీపీ శరచ్చంద్ర పవార్ పార్టీకి ఇంకా పార్టీ గుర్తుని కేటాయించలేదు.
 
ఉదయించే సూర్యుడు, కళ్లజోడు, మర్రి చెట్టు ఈ మూడింట్లో ఏదో ఒక గుర్తును కేటాయించే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా శరద్ పవార్‌కు ప్రత్యామ్నాయ పేరు సూచించేందుకు బుధవారం సాయంత్రం 4 గంటల వరకు సమయం ఇచ్చింది. ఎలాంటి సూచన చేయకపోవడంతో ఈ పేరుని కేటాయించింది. కాగా పార్టీ పేరుపై న్యాయవాదులు, పార్టీ నాయకులతో శరద్ పవార్ పలు సమావేశాలు నిర్వహించినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 
 
పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు అయోమయానికి గురికాకుండా ప్రత్యామ్నాయ పేర్లపై చర్చించారు. పేరు మధ్యలో లేదా ముందు 'నేషనలిస్ట్' పదాన్ని ఉంచాలని ఒక అభిప్రాయానికి వచ్చినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు పార్టీని గడియారం సింబల్తో గుర్తిస్తారు కాబట్టి పార్టీ పేరు, సింబల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
 
కాగా కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గమే అసలైన ఎన్సీపీ అని తేల్చిచెప్పింది. రాష్ట్ర అసెంబ్లీలో అజిత్ పవార్ వర్గం వైపే ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా గతేడాది జులైలో బీజేపీతో పొత్తు కోసం ఎన్సీపీ పార్టీని అజిత్ పవార్ చీల్చారు. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో భాగమయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్సీపీకి మొత్తం 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా కేవలం 12 మంది శరద్ పవార్ వైపు ఉన్నారు. మిగతావారంతా అజిత్ పవార్ వైపే ఉన్నారు.