గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (14:34 IST)

బిల్లు కట్టలేరా? అయితే బిడ్డను మాకు అమ్మడి : ఆస్పత్రి యాజమాన్యం బరితెగింపు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఆస్పత్రి యాజమాన్యం బరితెగింపు వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ స్థానికంగా ఉండే ఆస్పత్రిలో ప్రసవించింది. అయితే, ఆస్పత్రి బిల్లు చెల్లించలేకపోయింది. దీంతో ఆస్పత్రి యాజమాన్యం బిల్లు చెల్లించలేకుంటే బిడ్డను మాకు అమ్మేయాలంటూ ఒత్తిడి చేసింది. దీంతో ఆ పేద దంపతులు అవాక్కయ్యారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆగ్రాకు చెందిన బబిత అనే మహిళ నిండు గర్భిణి. ఈమె భర్త రిక్షాపుల్లర్. బబిత ఇటీవలే సిజేరియన్ ద్వారా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. వైద్య ఖర్చులు, మందులతో కలపి రూ.35 వేలు అయ్యాయంటూ ఆస్పత్రి వర్గాలు బిల్లును వారి చేతిలో పెట్టాయి. 
 
కానీ అంతటి డబ్బు ఇచ్చుకోలేని దీన స్థితి వారిది. ఇంతలో ఊహించని పరిణామం. బిల్లు కట్టలేకపోతే.. బిడ్డను తమకు అమ్మేయాలంటూ ఆస్పత్రి యాజమాన్యం సూచించింది. ఆస్పత్రి ఆఫర్ గురించి ఆ దంపతులు స్వయంగా మీడియా వారికి చెప్పారు. లక్ష రూపాయలు తీసుకుని బిడ్డను వదులుకోవాలని సూచించినట్టు తెలిపారు. చివరకు.. వారు రోజుల వయసున్న తమ బిడ్డను వదులుకున్నారు. ఆగ్రాలో జరిగిన ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. 
 
బిల్లు కోసం బిడ్డను అమ్ముకున్న ఉదంతం తన దృష్టికి వచ్చిందని స్థానిక మున్సిపల్ వార్డు కౌన్సిలర్ హరిమోహన్ తెలిపారు. ఆ దంపతులు కఠిక పేదరికం అనుభవిస్తున్నారని తెలిపారు. అయితే ఆస్పత్రి వర్గాలు మాత్రం ఈ ఆరోపణలను తోసి పుచ్చాయి. 
 
'ఈ ఆరోపణలు నిజం కాదు. బిడ్డను వదులు కోవాలని మేము బలవంతం చేయలేదు. వారే స్వయంగా తమ బిడ్డను దత్తత నిచ్చారు. ఇందుకు తమ సమ్మతం తెలుపుతూ వారు సంతకాలు చేసిన డాక్యుమెంట్లు మావద్ద ఉన్నాయి' అని ఆస్పత్రి యాజమాన్యం బుకాయిస్తోంది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ సైతం విచారణకు ఆదేశించారు.