సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

చాక్లెట్ల ఆశ చూపి ఐదేళ్ల చిన్నారిని చంపేసిన కిరాతకుడికి మరణశిక్ష

hang
చాక్లెట్ల ఆశ చూపి ఐదేళ్ల చిన్నారిని కిరాతకంగా అత్యాచారం చేసి.. ఆపై దారుణంగా హత్య చేసిన ఓ నరరూప రాక్షసుడికి మరణశిక్ష విధిస్తూ కేరళ కోర్టు తీర్పునిచ్చింది. అలాగే, ఐదు యావజ్జీవ శిక్షలు విధించడంతో పాటు రూ.7.3 లక్షల అపరాధం చెల్లించాలంటూ కోర్టు తీర్పునిచ్చింది. తాజాగా వెల్లడైన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, 
 
కేరళలోని అలువా ప్రాంతంలో జులై 28న బిహారీ వలస కార్మికుడు అస్ఫాక్‌ ఆలం (28). తనతో పాటు అదే భవనంలో నివసిస్తున్న తోటి బిహారీ వలస కుటుంబానికి చెందిన ఐదేళ్ల బాలికకు మిఠాయిలు కొనిపెడతానని చెప్పి బయటకు తీసుకుపోయాడు. తర్వాత మామిడి పండ్ల రసం తాగిస్తూ దూరంగా తీసుకుపోవడం సీసీ టీవీలో నమోదైంది. దారిలో ఎదురైన ఒక వ్యక్తికి తాను ఆ బాలిక తండ్రినని నమ్మబలికాడు.
 
అక్కడ నుంచి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన  తర్వాత బాలికకు మద్యం తాగించి పదేపదే అత్యాచారం చేశాడు. తర్వాత ఆ బాలిక దుస్తులనే మెడకు బిగించి హతమార్చాడు. ఆమె మృతదేహంపై చెత్త పడేసి, గ్రానైట్‌ ముక్కల కింద పూడ్చిపెట్టాడు. దీనిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపి అస్ఫాక్ ఆలం‌ను అరెస్టు చేయగా, ఈ కేసు విచారణ కొచ్చిన్ కోర్టులో జరిగింది. 
 
ఈ కేసును విచారించిన కోర్టు.. ఆలంను కనుక విడిచిపెడితే మరెందరో మైనర్‌ బాలికలతో పాటు పుట్టబోయే ఆడశిశువులకూ ప్రమాదమని నొక్కిచెప్పింది. ఆలం వయసు, సామాజిక ఆర్థిక నేపథ్యం, విద్య, మానసిక స్థాయులను పరిగణనలోకి తీసుకుని శిక్ష తగ్గించాలన్న డిఫెన్స్‌ న్యాయవాది వాదాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. 
 
2018లో ఢిల్లీలో పదేళ్ల బాలికపై ఆలం లైంగిక దాడి చేసినందుకు నెలరోజులు జైలులో ఉండి బెయిలుపై విడుదలయ్యాడు. బాలలపై లైంగిక నేరాల కట్టడికి ఉద్దేశించిన పోక్సో చట్టం, ఐపీసీ నిబంధనలను అనుసరించి ఆలంకు హైకోర్టు ఐదు యావజ్జీవ కారాగారాలతోపాటు ఒకటి నుంచి పదేళ్ల వరకు విడివిడిగా జైలు శిక్షలు విధించింది. దోషి తొలుత స్వల్పకాల జైలు శిక్షలు, ఆ తర్వాత  యావజ్జీవ కారాగార శిక్షను అనుభవించాలని కోర్టు స్పష్టం చేసింది. తీర్పును సవాలు చేసే అవకాశం ఆలంకు ఉన్నందున, ఆ అవకాశాన్ని అతడు ఉపయోగించుకున్న తర్వాత ఉరిశిక్ష అమలు చేయాలని పేర్కొంది.