పోలవరం నిర్మాణం జాప్యానికి వైకాపా కాదు.. టీడీపీనే : మంత్రి అంబటి రాంబాబు
పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం నెలకొనడానికి తమ ప్రభుత్వం కాదని, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని ఏపీ నీటి పారుదల శాఖామంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఆయన శుక్రవారం పోలవరం వద్ద జరుగుతున్న కాపర్ డ్యాం, డయాఫ్రం వాల్ పనులతో పాటు ఇతర పనులను కూడా పరిశీలించారు. ఆ తర్వాత ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు.
గత ప్రభుత్వం తొందరపాటు వల్ల పోలవరం ప్రాజెక్టుకు కష్టాలు వచ్చాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడానికి కూడా గత టీడీపీ ప్రభుత్వమే ప్రధాన కారణమని ఆయన అన్నారు. గత ప్రభుత్వం కాపర్ డ్యామ్ పనులను గాలికి వదిలివేసిందని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపర్ డ్యాప్ ఎత్తును పెంచామని చెప్పారు.
అదేసమయంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. ఈ ప్రాజెకు నిర్మాణానికి కేంద్రం ఆసక్తి చూపకపోగా నిధులు కూడా ఇవ్వడం లేదన్నారు. అయినప్పటికీ రాష్ట్ర నిధులను ఖర్చు చేస్తూ ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తున్నామని చెప్పారు.