శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 డిశెంబరు 2020 (22:03 IST)

శతాబ్దాల నాటి చట్టాలు గుదిబండల్లా మారాయి : ప్రధాని మోడీ

ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేపట్టారు. ఢిల్లీ సరిహద్దుల్లో గత 12 రోజులుగా ఈ ఆందోళన సాగుతోంది. ఈ చట్టాలను రద్దు చేసేంతవరకు తమ ఆందోళనను విరమించబోమని రైతు సంఘాలు తేల్చి చెప్పాయి. పైగా, మంగళవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. 
 
ఈ క్రమంలో రైతుల సంఘాల ఆందోళనపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. అభివృద్ధి జరగాలంటే సంస్కరణల అవసరం ఎంతైనా ఉందని, కానీ శతాబ్దాల నాటి పాత చట్టాలు అందుకు అడ్డంకిగా మారాయని వ్యాఖ్యానించారు.
 
"పురోగతి దిశగా కొత్త ఏర్పాట్లు జరగాలంటే సంస్కరణలు తీసుకురావాల్సిందే. కానీ గత శతాబ్దానికి చెందిన చట్టాలతో కొత్త శతాబ్దాన్ని ఎలా నిర్మించగలం? పాత రోజుల్లో మంచిని ఆశించి చేసిన చట్టాలు ఇప్పుడు గుదిబండల్లా తయారయ్యాయి. సంస్కరణలు అనేవి నిరంతర ప్రక్రియ" అని పేర్కొన్నారు. 
 
గ‌త శ‌తాబ్దంలో మంచిగా అనిపించిన చ‌ట్టాలు.. ఇప్పుడు భారంగా మారాయ‌ని, సంస్క‌ర‌ణ‌లు నిరంత‌ర ప్ర‌క్రియ అని ఆయ‌న అన్నారు. త‌మ ప్ర‌భుత్వ సంపూర్ణంగా సంస్క‌ర‌ణ‌లు చేప‌డుతోంద‌ని, గ‌తంలో కొన్ని రంగాలు, శాఖ‌ల వారీగానే సంస్క‌ర‌ణ‌లు జ‌రిగేవ‌ని మోడీ చెప్పారు. 
 
మంగ‌ళ‌వారం భార‌త్ బంద్‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చిన నేప‌థ్యంలో వాళ్లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను మోడీ స‌మ‌ర్థించుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే రైతులు, ప్ర‌భుత్వం మ‌ధ్య ఐదు విడ‌త‌లుగా చ‌ర్చ‌లు జ‌రిగినా.. ఫ‌లితం లేకుండా పోయింది.