శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 జూన్ 2023 (16:39 IST)

మండిపోతున్న ఉత్తర భారతం... రాష్ట్రాలకు కేంద్రం సూచనలు

mansuk mandaviya
దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో వడగాలులతో ప్రజలు తీవ్రంగా తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు రాష్ట్రాల్లో ఉన్న వేడి తీవ్రతను గుర్తించి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. 
 
కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో భారత వాతావరణ విభాగం సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడగాలుల తీవ్రత ఉన్న రాష్ట్రాల్లో పర్యటించేందుకు కేంద్రం, ఐఎండీకి చెందిన ఐదుగురు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం వేడి తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించనున్నట్లు కేంద్రమంత్రి మాండవీయ తెలిపారు. 
 
మరోవైపు వేడిగాలులు, వాతావరణ పరిస్థితుల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలను సూచించాలని భారత వైద్య పరిశోధన మండలి, కేంద్రమంత్రి ఆదేశించారు. ఈ ప్రభావం ప్రజలపై చూపకుండా ఉండేలా తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. వడదెబ్బ నుంచి ప్రజలను రక్షించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు మాండవీయ తెలిపారు. 
 
ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలకు చెందిన ఆరోగ్యశాఖ మంత్రులతో త్వరలోనే వర్చువల్‌ భేటీ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. రానున్న రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ చర్యలు మొదలుపెట్టింది.