బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2022 (07:43 IST)

అమిత్ షా తెరవెనుక హీరో : రాజ్‌నాథ్ సింగ్

rajnath
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. అమిత్ షా తెరవెనుక హీరో అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. గంభీరంగా కనిపించినా పేరు కోసం పాకులాడకుండా, అప్పగించిన పనుల్ని చిత్తశుద్ధితో పూర్తి చేయడం అమిత్ షా అలవాటన్నారు. అది ఆయన ప్రత్యేకత అని, ఆయన నేపథ్య కథానాయకుడన్నారు. 
 
వేర్వేరు సందర్భాల్లో షా చేసిన ప్రసంగాలతో ముద్రించిన 'శబ్దాంశ్‌' పుస్తకాన్ని బుధవారం రాజ్‌నాథ్‌ ఆవిష్కరించారు. 'రాజకీయం, ఆధ్యాత్మికత అనే రెండూ ఉన్న అరుదైన వ్యక్తిత్వం అమిత్‌ షా సొంతం. తెరవెనుక ఉంటూనే ప్రభుత్వం కోసం, పార్టీ కోసం ఆయన ఎన్నో పనుల్ని చేస్తుంటారు. అయినా వేర్వేరు రంగాలను అధ్యయనం చేయడానికి సమయం కేటాయించే తీరు అనేకమందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. 
 
ఆయన జీవితం ఒక ప్రయోగశాల. దర్యాప్తు సంస్థలు ఎక్కడకు రమ్మంటే అక్కడకు వెళ్లారే గానీ దానిపై హంగామా చేయలేదు. అనేక నెలలు జైల్లో గడపాల్సి వచ్చినా, చివరకు కోర్టులో నిర్దోషిగా బయటపడ్డారు. సవాళ్లు ఎదురైనప్పుడల్లా ఆయన మరింత రాటుదేలారు. రాజకీయాలనేవి సమాజాన్ని సరైన మార్గంలో నడపడానికి ఉద్దేశించినవి. ఆ అర్థమే మారిపోవడంతో రాజకీయ నేతల్ని ప్రజలు వేరేవిధంగా చూస్తున్నారు. ఆ పరిస్థితిని మార్చడానికి షా కృషి చేస్తున్నారు' అని రాజ్‌నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు.