శుక్రవారం, 22 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (10:26 IST)

ప్రధాన మోడీని మద్దతు కోరిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి

Yashwant Sinha
దేశంలో రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ సాగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి తరపున పోటీ చేసే ద్రౌపది ముర్ము  శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. విపక్షాల అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని యశ్వంత్ సిన్హా కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీకి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఫోనులో కోరారు. అలాగే, బీజేపీ అగ్రనేత ఎల్కే. అద్వానీకి కూడా ఆయన ఫోను చేసి మాట్లాడారు. 
 
నిజానికి తన సొంత రాష్ట్రం ఝార్ఖండ్‌లో శుక్రవారం నుంచి ప్రచారాన్ని ప్రారంభించాలని సిన్హా భావించారు. అయితే సంతాల్‌ గిరిజన తెగకు చెందిన ముర్ముకు మద్దతు ఇవ్వాలన్న ఆలోచనలో సొరెన్‌ (ఆయనదీ అదే తెగ) ఉన్నట్లు గమనించిన యశ్వంత్‌.. ప్రచారాన్ని వాయిదా వేసుకున్నారు. 
 
జేడీఎస్‌ కూడా ముర్ముకు మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తోంది. సమాజ్‌వాది పార్టీ యశ్వంత్‌ సిన్హాకే మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ ఎమ్మెల్యేల, ఎంపీల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.  
 
ఇదిలావుంటే రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హాకు కేంద్ర ప్రభుత్వం జెడ్‌ కేటగిరీ భద్రతను కల్పించింది. ఈ మేరకు సీఆర్పీఎఫ్‌లోని వీఐపీ రక్షణ విభాగానికి ఆదేశాలు జారీ అయ్యాయి.
 
సిన్హా దేశవ్యాప్తంగా పర్యటించేటప్పుడు ఈ దళానికి చెందిన 8-10 మంది సాయుధ కమాండోలు విడతలవారీగా ఆయనకు రక్షణగా ఉంటారు. ఈ నెల 27న ఆయన నామినేషన్‌ దాఖలు చేస్తారని భావిస్తున్నారు.