1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2020 (16:08 IST)

జమ్మూకాశ్మీర్‌లో ఉద్యోగాలు ఎవరికి? అమిత్ షా కీలక ఆదేశాలు!!

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో దశాబ్దాలుగా అమలవుతున్న ఆర్టికల్ 370ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు రద్దు చేసింది. దీంతో జమ్మూకాశ్మీర్‌లో భారత పౌరసత్వం కలిగిన ఎవరైనా స్థిరనివాసం ఏర్పరచుకునే వెసులుబాటు కలిగింది. అయితే, దీంతో ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఇతరులు తన్నుకుపోతారన్న భయం స్థానికుల్లో నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో ఉద్యోగాల స్థానికతపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం కీలక ప్రకటన చేశారు. ఇందుకోసం ఆయన కొత్త మార్గదర్శకాలను రూపొందించారు. ఇకపై ఈ మార్గదర్శకాల కిందికి వచ్చే వారే అక్కడి స్థానిక ఉద్యోగాలకు పూర్తి అర్హులని కేంద్ర హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఈ మార్గదర్శకాల మేరకు... జమ్మూకాశ్మీర్‌లో నిరాటంకంగా 15 సంవత్సరాలు స్థిర నివాసం ఉండాలి. లేదా ఏడు సంవత్సరాల పాటు జమ్మూకాశ్మీర్‌లోనే విద్యనభ్యసించి ఉండాలి. అలాగే, పదో తరగతి, ఇంటర్మీడియట్ అక్కడే చదువుకున్న వారిని స్థిర నివాసులుగా పరిగణించబడతారు. అయితే ఈ కొత్త మార్గదర్శకాలు 25,500 రూపాయల ప్రాథమిక వేతనం ఉన్న అన్ని పోస్టుల నియామకాలకూ ఈ నివాస నియమం వర్తిస్తుందని అందులో పేర్కొన్నారు.
 
కానీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, స్వయం ప్రతిపత్తి గల కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, కేంద్రీయ విశ్వవిద్యాలయాల అధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పరిశోధనా సంస్థల తరపున జమ్మూ కాశ్మీర్‌లో దాదాపు 10 యేళ్ళపాటు పనిచేసే వారందర్నీ ఇకపై స్థానికులుగా గుర్తిస్తారు. వీరందరూ జమ్మూకాశ్మీర్‌లోని ప్రభుత్వ శాఖల్లో అందుబాటులో ఉండే ఉద్యోగాలకు అర్హులుగా కేంద్ర హోం శాఖ కొత్త మార్గదర్శకాలను రూపొందించింది.