భారత్‌లో 647కి చేరిన కరోనా కేసులు..
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. గురువారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నిర్థారణ కేసుల సంఖ్య 647కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. కొవిడ్-19కారణంగా ఇప్పటివరకు మొత్తం 13మంది మృతి చెందినట్లు ప్రకటించింది. మొత్తం బాధితుల్లో 43మంది కోలుకోగా 593మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో అత్యధికంగా 124కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో ఒకరు కోలుకోగా మరో ముగ్గురు మరణించారు. కేరళలో ఈ కేసుల సంఖ్య 118కి చేరగా వీరిలో నలుగురు కోలుకున్నారు. ఇక తెలంగాణలో 41కేసులు, ఏపీలో 11 కేసులు, గోవాలో మూడు కరోనా వైరస్ కేసులు, కాశ్మీర్‌లో తొలి కరోనా మరణం నమోదైంది.
హైదర్‌పోరా గ్రామంలో కొవిడ్-19 కారణంగా 65ఏళ్ల వ్యక్తి మరణించినట్లు కాశ్మీర్ వైద్య అధికారులు వెల్లడించారు. అనంతరం ఈ వ్యక్తి కుటుంబంలోని నలుగురికి కూడా వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా సాయం చేస్తామని శ్రీనగర్ మేయర్ జునైద్ అజీం ట్విట్టర్‌లో తెలిపారు.