భారత మహిళ అంజును పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు : పాక్ యువకుడు
తన కోసం భారత్ నుంచి పాకిస్థాన్‌కు వచ్చిన అంజు అనే వివాహితను పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం తనకు ఏమాత్రం లేదని పాకిస్థాన్‌కు చెందిన ఫేస్‌బుక్ ప్రియుడు నస్రుల్లా (29) స్పష్టం చేశాడు. పైగా, ఆమె త్వరలోనే స్వదేశానికి వెళ్లిపోతుందని తెలిపాడు. తమ మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని, వీసా గడువు ముగియగానే ఆమె స్వదేశానికి వెళ్లిపోతుందని చెప్పాడు.
"ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన అంజు అనే వివాహిత.. పాకిస్థాన్ సందర్శనకు వచ్చింది. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని లేదు. మా ఇంటిలో మా కుటుంబానికి చెందిన ఆడవారితో కలిసి ఆమె ప్రత్యేక గదిలో ఉంటుంది. జిల్లా యంత్రాంగం మాకు తగిన భద్రత కల్పించింది" అని అప్పర్ దిర్ జిల్లా, కుల్లో గ్రామానికి చెందిన నస్రుల్లా భారత వార్తా సంస్థకు ఫోనులో చెప్పాడు.
అంజు (34), అర్వింద్ దంపతులు రాజస్థాన్ అల్వార్ జిల్లాలో నివసిస్తున్నారు. వారికి 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అంజుకు ఫేస్‌బుక్‌లో పాకిస్థాన్‌కు చెందిన నస్రుల్లా అనే యువకుడితో 2019లో పరిచయం ఏర్పడింది. దీంతో ఔషధ రంగంలో పనిచేస్తున్న అతడిని కలుసుకోవడానికి అంజు జైపూర్ నుంచి బయలుదేరి పాక్‌లోని ఖైబర్ పఖుంఖ్వాకు వెళ్లింది. అక్కడి పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే వీసాతోపాటు ఇతర అనుమతి పత్రాలన్నీ సక్రమంగా ఉండటంతో ఆమెను విడిచిపెట్టారు. ప్రస్తుతం ఆమె తన ప్రియుడి నస్రుల్లా ఇంటిలో ఉంటుంది.