శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2024 (16:07 IST)

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

bjp flags
చెన్నై నగర నడిబొడ్డున ఉన్న అన్నా విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా, విపక్ష పార్టీలైన అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే వంటి పార్టీలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని చేపట్టింది. ఇందులోభాగంగా, బాధితురాలికి న్యాయం చేయాలంటూ బీజేపీ మహిళా విభాగం డిమాండ్ చేస్తుంది. ఇందుకోసం ఆ పార్టీ భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. మదురై నుంచి చెన్నై వరకు దాదాపు 450కి.మీల మేర ర్యాలీ చేపట్టనున్నట్లు భాజపా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై వెల్లడించారు. ఈ కేసులో నిందితులు డీఎంకేకు చెందినవారని, అందుకే ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
 
మహిళలపై అకృత్యాలను నిరసిస్తూ భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఉమరాతి రాజన్ ఆధ్వర్యంలో ఈ న్యాయ ర్యాలీ జనవరి 3న ప్రారంభం కానుంది. ఈ ర్యాలీ చెన్నైకి చేరుకున్న అనంతరం మహిళా విభాగం తమ డిమాండ్లపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేయనుందని అన్నామలై తెలిపారు. అన్నావర్సిటీలోని క్యాంపస్‌లో ఇటీవల 19 ఏళ్ల విద్యార్థిపై లైంగిక దాడి ఘటన రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ దారుణంపై విపక్షాలతో పాటు పౌర సమాజం నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడు అధికార డీఎంకేకు చెందిన వ్యక్తి అంటూ పలువురు చేస్తున్న ఆరోపణల్ని ఆ పార్టీ ఖండించింది.