జయలలిత మరణానికి అసలు కారణమిదే : వెల్లడించిన అపోలో ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జయలలిత మరణంపై అనేక రకాల సందేహాలు నెలకొనివున్నాయి. ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని, అందువల్ల సీబీఐతో దర్యాప్తు జరిపించాలని పలువురు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయిం
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జయలలిత మరణంపై అనేక రకాల సందేహాలు నెలకొనివున్నాయి. ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని, అందువల్ల సీబీఐతో దర్యాప్తు జరిపించాలని పలువురు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జయలలిత మృతికి అసలు కారణాన్ని ఆమెకు చికిత్స అందించిన అపోలో ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి వెల్లడించారు.
ఆయన తాజాగా ఓ అంగ్ల పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సెప్టెంబర్ 22న ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి జయలలిత చికిత్సలకు బాగా స్పందించారని, ప్రతి రోజూ ఆమె తనను చూసినప్పుడల్లా చిరునవ్వు నవ్వేవారని చెప్పారు. జయలలిత సుగుణాలను చూసి తానెంతో ఆశ్చర్యపోయానని, తలచిన కార్యాన్ని ఖచ్చితంగా నిర్వర్తించగల సత్తా ఆమెకు మాత్రమే ఉండేదని అన్నారు.
జయలలిత అపోలో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఒకటి రెండు రోజులు మినహా తాను దగ్గరుండి చికిత్సలు అందించినట్టు చెప్పారు. నిజానికి రెండు మాసాలపాటు నేను నగరాన్ని విడిచిపెట్టలేదని, తమ శక్తికి మించి చేయాల్సిన చికిత్సలన్నింటినీ ఆమెకు అందించామని ఆయన తెలిపారు.
జయలలిత మృతి చెందటానికి కొద్ది రోజులముందు అత్యసవర పనుల మీద హైదరాబాద్‌కు వెళ్ళాల్సి వచ్చిందని, బయలుదేరటానికి ముందు ఆమెను పలుకరించానని, ఆమె ముఖంపై అదే చిరునవ్వు కనిపించిందని, ఆ సమయంలో టీవీ చూస్తున్నారని, తానే దగ్గరగా వెళ్లి ‘హైదరాబాద్ నుంచి తిరిగొచ్చేలోపున మీరు లేచి నడుస్తారు’ అంటూ చెప్పానని తెలిపారు.
హైదరాబాద్ నుంచి తిరిగొచ్చాక జయలలితను డిశ్చార్జి చేద్దామని నిర్ణయించుకున్నానని, చెన్నైకి తిరిగొచ్చాక ఆ విషయాన్ని పరిశీలిద్దాంలే అనుకుంటూ హైదరాబాద్‌కు వెళ్లానని చెప్పారు. హైదరాబాద్ నుంచి తిరిగొచ్చాక జయలలితకు గుండెపోటు వచ్చిందని తెలియగానే తీవ్ర దిగ్ర్భాంతికి గురైనట్టు చెప్పారు. హృద్రోగశస్త్ర చికిత్స వైద్యనిపుణుడొకరు జయలలితను నిరంతరం పరిశీలిస్తుండగానే ఆమెకు గుండెపోటు రావడం పట్ల ఆవేదన చెందానని, ఎందుకంటే అప్పటిదాకా ఆమెకు గుండెపోటు వచ్చేందుకు ఎలాంటి ఆనవాళ్లు అగుపడలేదని ప్రతాప్ రెడ్డి చెప్పారు.
గుండెపోటు వచ్చిన వెంటనే ప్రత్యేక వైద్యనిపుణుల బృందం రంగంలోకి దిగి చికిత్సలు ప్రారంభించిందని, ‘గోల్డెన్ అవర్’గా పరిగణించే ఆ సమయంలో జయలలితకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య చికిత్సలు చేపట్టామని, ఆమె చికిత్స పొందుతున్న గదికి సమీపంలోనే ‘ఎక్మో’ విభాగపు గది ఉందని, వెంటనే ఆమెకు ఆ పరికరాన్ని అమర్చామని చెప్పారు. ‘ఎక్మో’ చికిత్స చేసుకున్న పలువురు ప్రాణగండం నుంచి బయటపడ్డ సందర్భాలెన్నో ఉన్నాయని, దురదృష్టవశాత్తూ జయలలిత విషయంలో అది సాధ్యం కాలేకపోయిందని ప్రతాప్ రెడ్డి వివరించారు.