గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (14:42 IST)

మద్యం బాటిల్‌లో పాముపిల్ల.. సగం తాగేశాక దిమ్మ తిరిగింది.. చివరికి?

తమిళనాడులో ఓ మద్యం బాటిల్‌లో పాముపిల్ల కనిపించింది. కానీ ఆ మందుబాబు దాన్ని గమనించలేదు. చక్కగా సీసాలో సగం తాగేశాడు. ఆపై బాటిల్‌లో ఏదో ఉందని గమనించి చూడగా..అది పాము పిల్ల అని తెలిసి తాగిన మందు కిక్ ఎక్కకుండానే మొత్తం దిగిపోయింది. అంతే ఏం చేయాలో తెలీక తెగ అల్లాడిపోయాడు. తమిళనాడులో జరిగిన ఈ ఘటన మందుబాబులకు షాక్ ఇచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని అరియాలూరు జిల్లా చుట్టమల్లి గ్రామానికి చెందిన సురేష్ అనే 36 ఏళ్ల యువకుడు తన గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. రోజంతా పనిచేయటంతో ఒళ్లంతా అలసిపోవటంతో కాస్తంత మందు తాగి పడుకుంటాడు. అలా బుధవారం వ్యవసాయ పనులు ముగించుకొని వైన్ షాప్‌కు వెళ్లి..ప్రభుత్వ ఆధీనంలో నడిచే టాస్మాక్ దుకాణంలో ఓ మద్యం బాటిల్ కొనుక్కుని దాన్ని పట్టుకుని ఇంటికి వెళ్లాడు.
 
ఆ తర్వాత.. తెచ్చుకున్న మద్యం నుంచి సగం గ్లాస్‌లో పోసుకొని తాగాడు. ఆ తర్వాత సీసాలో అతడికి ఏదో ఉన్నట్లుగా అనుమానం వచ్చింది. పరిశీలనగా చూశాడు. అదేదో పాము పిల్లలాగా కనిపించింది. తాగింది కొంచెం కొంచెం మత్తు ఎక్కుతుండటంతో అదేదో తన భ్రమేమో అనుకున్నాడు. కళ్లు విప్పార్చుకుని మరోసారి చూశాడు. సీసా అడుగు భాగంలో చనిపోయిన పాము పిల్ల కనిపించింది.అంతే తాగింది మొత్తం దిగిపోయింది. అది చూసిన సురేష్ భయపడిపోయాడు. అప్పటికే కొంత మద్యం తాగడంతో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందాడు.  
 
అదే విషయాన్ని ఇంట్లోవాళ్లకు చెప్పగా..వాళ్లు కూడా కంగారుగా సురేష్‌ను హుటాహుటిన జయకొండం ఆస్పత్రికి తరలించారు. విషయాన్ని డాక్టర్లకు చెప్పారు. దాంతో మద్యం బాటిల్ లో ఉన్న పాముపిల్లను పరిశీలించిన డాక్టర్లు అతనికి వైద్యం చేశారు. ఫరవాలేదు అని భరోసా ఇచ్చారు. ఆ తరువాత సురేష్ కుటుంబ సభ్యులంతా వైన్ షాప్ మీదపై దాడి చేశారు. దానికి వాళ్లు ఈ బాటిల్ మేమేమన్నా తయారు చేశామా? సీల్ వేశామా? అని ఎదురు ప్రశ్నించారు. దీంతో మాకు ఎటువంటి సంబంధం లేదు. మేం కేవలం మద్యం మాత్రమే అమ్ముతామని స్పష్టం చేశారు. దీంతో ఏం చేయాలో వాళ్లకు తెలియలేదు.
 
కాగా సురేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మద్యం బాటిల్‌లో పాము రావడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వ ఆధీనంలో నడిచే మద్యం షాపుల్లోనే ఇలా జరిగితే ఇక ప్రజల పరిస్థితి ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.