సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 14 అక్టోబరు 2021 (17:26 IST)

ఆర్యన్ ఖాన్ బెయిల్ కేసు‌.. అక్టోబర్ 20న తీర్పు

బాలీవుడ్ బాద్షా షారూఖ్‌ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ బెయిల్ పిటిషన్‌పై ఎటూ తేల్చకుండానే ముంబైలోని ప్రత్యేక ఎన్డీపీఎస్ కోర్టు విచారణను ముగించింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి అక్టోబర్ 20వ తారీఖునకు తీర్పును రిజర్వ్ చేశారు.

దీంతో ఆర్యన్ ఖాన్‌కు మరో వారం రోజుల పాటు జైల్లోనే గడపాల్సి ఉంటుంది. కాగా, ఇప్పటికే ఓసారి సాంకేతిక కారణాల వల్ల ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ఎన్డీపీఎస్ కోర్టులో తప్పకుండా బెయిల్ వస్తుందని షారూఖ్ కుటుంబం భావించింది. కానీ, అనూహ్యంగా ఈ కేసులో తీర్పును కోర్టు అక్టోబర్ 20వ తారీఖునకు రిజర్వ్ చేసింది.
 
ఈ బెయిల్ పిటిషన్ పై బుధవారం జరిగిన వాదనలకు కొనసాగింపుగా గురువారం అడిషనల్ సోలిసిటర్ జనరల్ తన వాదనలను వినిపించారు. ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ అస్సలు ఇవ్వొద్దని కోర్టును కోరారు. ‘ఈ కేసులో అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాకు సంబంధించిన లావాదేవీలు ఉన్నాయి. వారితో ఆర్యన్ ఖాన్ ఫోన్ సంభాషణలు ఉన్నాయి.

ఈ పరిస్థితుల్లో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ వస్తే ఆధారాలను ధ్వంసం చేస్తారు. ఆర్యన్ ఖాన్ వద్ద డ్రగ్స్ దొరికాయా..? లేదా..? అన్నది ముఖ్యం కాదు. డ్రగ్స్ వ్యవహారంలో అతడి పాత్ర ఎంత ఉందన్నదే ముఖ్యం. గతంలో కేరళలో కేసులోనూ ఓ వ్యక్తి వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరక్కపోయినా అతడికి మూడేళ్ల పాటు జైలు శిక్ష పడింది.’ అంటూ అడిషనల్ సోలిసిటర్ జనరల్ తన వాదనలను వినిపించారు. 
 
అదే సమయంలో ఆర్యన్ తరపు లాయర్ అమిత్ దేశాయ్ కూడా కోర్టులో తన వాదనలను వినిపించారు. ‘విచారణలో మాటి మాటికి వాట్సప్ చాటింగ్, ఫోన్ కాల్ డేటా అంటూ ఎన్సీబీ మాట్లాడుతోంది. ఇప్పుడు ఆ ఫోన్ వారి వద్దే ఉంది. ఇప్పటికే ఆర్యన్ ఖాన్ వద్ద నుంచి ఒక్కసారి మాత్రమే స్టేట్‌మెంట్ తీసుకుంది. మరి ఆ ఫోన్‌ను వారి వద్దే ఉంచుకుని విచారణ కోసం ఉపయోగించుకుని ఆర్యన్ ఖాన్‌ను బెయిల్ పై విడుదల చేయడానికి ఎన్సీబీకి ఏం అభ్యంతరం?

ఆ ఫోన్‌లో ఉన్న డేటా ముఖ్యమా..? లేక ఆర్యన్ ఖానే ముఖ్యమా..?’ అంటూ ప్రశ్నించారు. ఆర్యన్ ఖాన్‌ను అక్టోబర్ 3వ తారీఖున అరెస్ట్ చేశారనీ.. పది రోజులు ముగిసినా విచారణలో ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నామన్నది ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి అక్టోబర్ 20వ తారీఖునకు తీర్పును రిజర్వ్ చేశారు.