అస్సోం వైద్యురాలికి సోకిన ఆల్ఫా - డెల్టా వేరియంట్లు
కరోనా వైరస్ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. గత యేడాదిన్నరకాలంగా భయంతో జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పిడింది. ఇపుడు ఈ వైరస్ పలు రకాలుగా రూపాంతరం చెంది ప్రజలపై దాడి చేస్తోంది. తాజాగా మన దేశంలో ఒకే వ్యక్తి రెండు వేరియంట్ల బారిన పడిన ఘటన వెలుగు చూసింది. అస్సోంకు చెందిన ఒక మహిళా వైద్యురాలికి ఒకేసారి ఆల్ఫా, డెల్టా వేరియంట్లు సోకినట్లు పరీక్షల్లో నిర్థారణైంది.
భారత్‌లో ఇది తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసని వైద్యులు స్పష్టం చేశారు. ఈ అంశంపై భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్)కి చెందిన అధికారి మాట్లాడుతూ.. అస్సోం మహిళా వైద్యురాలు ఒకే సమయంలో రెండు వేరియంట్ల బారినపడినట్లు గుర్తించామన్నారు. ఆమె నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా.. ఆల్ఫా, డెల్టా వేరియంట్లు సోకినట్లు గుర్తించామని, దీనిపై స్పష్టత కోసం మరోసారి నమూనాలు సేకరించామన్నారు.
ఈ రెండు వేరియంట్లు ఒకేసారి సోకవచ్చు లేదా ఒక వేరియంట్ సోకిన రెండు, మూడు రోజుల వ్యవధిలో మరో వేరియంట్ దాడి చేయవచ్చని అన్నారు. మొదట ఆమె భర్త ఆల్ఫా వేరియంట్ బారినపడ్డారని, ఆయన కూడా వైద్యులేనని అన్నారు. అయితే ఆ వైద్యురాలు కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారని, ఆమెకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని అన్నారు.
కాగా, అసోంలో సెకండ్ వేవ్ ప్రారంభంలో ఫిబ్రవరి - మార్చి సమయంలో ఎక్కువగా ఆల్ఫా వేరియంట్ కేసులు బయటపడగా, ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం అధికంగా డెల్టా వేరియంట్ కేసులు వచ్చాయని అన్నారు. మరోవైపు, బెల్జియంకు చెందిన వృద్ధురాలిలో ఇదే విధంగా రెండు రకాల వేరియంట్లు కనిపించాయి.