మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 9 నవంబరు 2019 (16:01 IST)

అయోధ్యలో మందిర నిర్మాణానికి అనుకూలం.. బీజేపీకి డోర్లు క్లోజ్ : కాంగ్రెస్

వివాదాస్పద అయోధ్య కేసులో శనివారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. అదేసమయంలో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి తాము అనుకూలమని ప్రకటించింది. 
 
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా స్పందించారు. అయోధ్యలో వివాదస్పద స్థలంపై సుప్రీంకోర్టు వెలువరించిన నేపథ్యంలో రాజకీయ నాయకులు, పెద్దలు సంయమనం పాటించాలని లౌకికవాద విలువలను కాపాడాలని కోరారు. 'సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. మేము రామమందిర నిర్మాణానికి సానుకూలంగా ఉన్నాం. మందిర నిర్మాణానికి ఈ తీర్పు తలుపులు తెరవడమే కాదు.. అయోధ్య అంశాన్ని రాజకీయం చేసిన బీజేపీ, ఇతరులకు తలుపులు మూసేసింద'ని ఆయన వ్యాఖ్యానించారు. 
 
'అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్‌ పార్టీ స్వాగతిస్తోంది. లౌకిక విలువలకు కట్టుబడాలని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని మతాల వారిని కోరుతున్నాం. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ శాంతి, సౌభ్రాతృత్వాలను కలిగివుండాలని ఆకాంక్షిస్తున్నట్టు' అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది.