అయోధ్యలో మందిరం కూడా నిర్మిస్తారు.. కానీ హింసను ఆపలేమా? ప్రకాష్ రాజ్ ట్వీట్

prakash raj
ఠాగూర్| Last Updated: శనివారం, 9 నవంబరు 2019 (14:35 IST)
రామజన్మభూమి అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. దీనిపై నటుడు ప్రకాశ్ రాజ్ తనదైనశైలిలో స్పందించారు. ఈ మేరకు ఆయన తన సుప్రసిద్ధ "జస్ట్ ఆస్కింగ్" హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి ట్వీట్ చేశారు.

"అయోధ్యలో మందిరం నిర్మిస్తారు, మసీదు కూడా కట్టొచ్చు గాక! కానీ ఇప్పటికే ఎంతో రక్తపాతం జరిగింది. మనిషి ప్రాణం ఎంతో విలువైంది. తదనంతరం జరగబోయే హింసను, రెచ్చగొట్టే ధోరణులను మనం ఆపలేమా! మనిషి ప్రాణాలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టలేమా! దయచేసి ఆలోచించండి!" అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అలాగే, బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందిస్తూ, సుదీర్ఘకాలంగా అనేక ప్రభుత్వాలను ఇబ్బందిపెట్టిన అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పును ఇవ్వడం స్వాగతించదగ్గ విషయమన్నారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులదేనని స్పష్టం చేసిందనీ, సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు. శతాబ్దాల సమస్యకు పరిష్కారం లభించిందని వ్యాఖ్యానించారు.

దశాబ్దాల తరబడి సాగిన వాదోపవాదాలను విన్న తర్వాత, సాక్ష్యాల పరిశీలన అనంతరం, సత్యశోధన జరిపిన పిదప సుప్రీం కోర్టు ఆమోదయోగ్యమైన తీర్పు వెలువరించిందని వ్యాఖ్యానించారు. ఇది గెలుపోటముల విషయం కాదని, దేశ ప్రజలందరూ ఒక్కటేనంటూ భిన్నత్వంలో ఏకత్వం నిరూపించాల్సిన సమయం అని పిలుపునిచ్చారు.దీనిపై మరింత చదవండి :