చైనా వస్తువుల బహిష్కరణ సమస్యకు పరిష్కారం కాదు : చిదంబరం
చైనా వస్తువులను బహిష్కరించడం సమస్యకు పరిష్కారం కాదని కేంద్ర మాజీ విత్తమంత్రి పి.చిదంబరం వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్ చైనా దేశాల మధ్య సరిహద్దు ఘర్షణలు చెలరేగివున్నాయి. ముఖ్యంగా, లడఖ్ సమీపంలోని గాల్వాన్ లోయలో చైనా ఆర్మీ హద్దుమీరి దాడి చేసింది. ఈ దాడిలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
ఈ చర్యలు ప్రతి ఒక్క భారత పౌరుడు తీవ్రంగా ఖండిస్తున్నారు. పనిలోపనిగా భారత్‌లోకి ఇబ్బడిముబ్బడిగా దిగుమతి అవుతున్న చైనా వస్తువులను నిలిపివేయాలనీ, స్వదేశీ బ్రాండ్లనే వినియోగించాలన్న డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి.
వీటిపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం స్పందించారు. భారత్‌లో తప్పకుండా స్వయం సమృద్ధి సాధించాలన్నారు. అయితే, అదేసమయంలో ఇతర దేశాలతో సంబంధాలు తెగిపోకుండా చూసుకోవాలని హితవు పలికారు.
చైనా ఉత్పత్తులను దేశంలో బహిష్కరించకుండా మనం గ్లోబల్ సప్లయ్ చెయిన్‌లో భాగస్వామిగా కొనసాగాలని తెలిపారు. చైనాకి ప్రపంచంతో ఉన్న వాణిజ్య సంబంధాలతో పోల్చి చూస్తే ఆ దేశానికి భారత్‌తో వాణిజ్యం ఏపాటిదని చిదంబరం నిలదీశారు.
ఆ దేశ ఉత్పత్తులను భారత్‌లో బహిష్కరిస్తే డ్రాగన్ దేశ ఆర్థికవ్యవస్థకు కలిగే నష్టం పెద్దగా ఉండబోదన్నారు. చైనా వస్తువుల బహిష్కరణ వంటి చిన్న విషయాలను లేవనెత్తి సమయాన్ని వృథా చేయొద్దని, దేశ భద్రత గురించి చర్చించాలని కేంద్రానికి చిదంబరం హితవు సూచించారు.