శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 6 మార్చి 2019 (11:29 IST)

అన్న అప్పు చెల్లించలేదనీ చెల్లిపై వడ్డీ వ్యాపారి అత్యాచారం..

అన్న తీసుకున్న అప్పు చెల్లించక పోవడంతో అతని చెల్లిపై కన్నేసిన వడ్డీ వ్యాపారి ఆ యువతిని కిడ్నాప్ చేసి రెండేళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ దారుణం కర్ణాటక రాజధాని బెంగుళూరులో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన తారకనాథ్ అనే వ్యక్తి బతుకుదెరువు కోసం బెంగుళూరు నగరానికి తన భార్యతో కలిసి వచ్చారు. ఈయన తన భార్యతో కలిసి హుళిమాపులో నివసిస్తూ వచ్చాడు. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన తారకనాథ్‌ అందులో నష్టం వాటిల్లడంతో దివాళా తీశాడు. దీంతో అదే ప్రాంతానికి చెందిన బాలాజీ అనే వడ్డీ వ్యాపారి వద్ద రూ.6 లక్షల మేరకు అప్పు తీసుకున్నాడు. 
 
ఈ డబ్బు పెట్టిన షేర్లు కూడా నష్టాలు వచ్చాయి. దీంతో బాలాజీకి అప్పు తిరిగి చెల్లించలేక పోయాడు. దీంతో ఆయన తరచుగా ఇంటికి వచ్చి తారకనాథ్‌ను బెదిరించసాగాడు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న తారకనాథ్‌ చెల్లెలు ఉద్యోగం కోసం బెంగళూరు నగరానికి వచ్చి అన్న ఇంట్లోనే ఉండసాగింది. 
 
ఈ క్రమంలో ఓ రోజు తీసుకున్న అప్పు చెల్లించాలని ఎప్పటిలాగే తారక్‌నాథ్ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో అతని సోదరి ఇంట్లో ఉండటాన్ని చూసిన బాలాజీ... ఆమెపై కన్నేసిన... ఆమెను లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. ఆ తర్వాత అప్పు తీర్చాలన్న సాకుతో తారక్‌నాథ్ ఇంటికి బాలాజీ రాకసాగాడు. అయితే, డబ్బులు చెల్లించలేడని గ్రహించిన బాలాజీ... తారక్‌నాథ్ చెల్లిని బెదిరించి రెండేళ్లుగా అత్యాచారం చేయసాగాడు. 
 
బాధితురాలు రెండేళ్లుగా మౌనంగా భరిస్తూ వచ్చింది. దీన్ని అలుసుగా తీసుకున్న బాలాజీ మరింత రెచ్చిపోయాడు. కొద్ది రోజుల క్రితం తారకనాథ్‌ను అపహరించిన బాలాజీ తారకనాథ్‌పై ఇష్టారీతిన దాడి చేసి అప్పు చెల్లించకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు ఇటీవలే తాను ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగంలో చేరానని కొద్దిగా సమయం ఇస్తే అప్పు వడ్డీతో సహా చెల్లిస్తానంటూ విన్నవించింది. 
 
అందుకు బాలాజీ నిరాకరించడంతో హుళిమావు పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు తనపై జరుగుతున్న అత్యాచారం గురించి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటివరకు వడ్డీ వ్యాపారి బాలాజీకి నగదు రూపంలో, ఆన్‌లైన్‌లో రూ.30 లక్షలు బదిలీ చేసానని దీంతోపాటు బాలాజీ తన నుంచి రూ.13 లక్షల విలువ చేసే ఆభరణాలు కూడా లాక్కున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలాజీని అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.