బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (12:33 IST)

ఆరు ట్రంకుపెట్టెలు తెచ్చుకోండి.. జయలలిత బంగారు, వజ్రాభరణాలు ఇస్తాం..

jayalalithaa
తమిళనాడు ప్రభుత్వానికి బెంగుళూరు కోర్టు నుంచి ఓ కబురు వచ్చింది. ఆరు ట్రంకు పెట్టెలు తెచ్చుకుంటే మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బంగారు, వజ్రాభరణాలను ఇస్తామని సమాచారం చేరవేసింది. మార్చి 6, 7 తేదీల్లో ఈ ఆభణాలను తీసుకునేందుకు బెంగుళూరుకు రావాలని కోరింది. ఈ కేసును విచారించిన సివిల్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి మార్చి 6, 7 తేదీలను ప్రకటిస్తూ, ఆ రెండు రోజుల్లో ఇతర కేసుల విచారణ చేపట్టకూడదని నిర్ణయించారు.
 
'ఆ బంగారు ఆభరణాలు తీసుకోవడానికి ఒక అధికారిని నియమించాం. తమిళనాడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజీపీ ఆ అధికారితో సమన్వయం చేసుకోవాలి. ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, ఆరు పెద్ద ట్రంకు పెట్టెలు, అవసరమై భద్రత సిబ్బందితో వచ్చి బంగారు ఆభరణాలను తీసుకోవాలి. తమిళనాడు డిప్యూటీ ఎస్​పీ ఈ విషయాన్ని హోంశాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లాలి. ఆ రోజుల్లో భద్రతకు స్థానిక పోలీసులను ఏర్పాటు చేసుకోనేలా చర్యలు తీసుకోవాలి' అని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
 
ఈ కేసు విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం రూ.5 కోట్లు ఖర్చు చేసిందని న్యాయవాది తెలిపారు. ఇందుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం రూ.5 కోట్ల డీడీని కర్ణాటకకు ఇదివరకే అందించిందని చెప్పారు. అయితే, ఆ మొత్తం ఇంకా కర్ణాటక ఖజానాలో జమకాలేదని పేర్కొన్నారు. 
 
మరోవైపు, కర్నాటక ప్రభుత్వం వద్ద జయలలిత ఆభరణాలు, ఇతర వస్తువులను పరిశీలిస్తే, అక్రమార్జన కేసులో 1996లో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులన్నీ ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. అందులో 7,040 గ్రాముల 468 రకాల బంగారు, వజ్రాభరణాలు, 700 కిలోల వెండి వస్తువులు, 740 ఖరీదైన చెప్పులు ఉన్నాయి. వాటితో పాటు 11,344 పట్టు చీరలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీ సెట్లు, 8 వీసీఆర్‌లు, 1 వీడియో కెమెరా, 4 సీడీ ప్లేయర్లు, 2 ఆడియో డెక్, 24 టూ ఇన్ వన్ టేప్ రికార్డర్లు, 1040 వీడియో క్యాసెట్లు, 3 ఐరన్ లాకర్లు, రూ.1,93,202 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటినీ కర్నాటక ప్రభుత్వం ఇపుడు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించనుంది.