ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2022 (15:26 IST)

నాసల్ కరోనా టీకాకు కేంద్రం అనుమతి - బూస్టర్ డోస్‌గా వేసుకోవచ్చు..

covid nasal vaccine
దేశంలో ముక్కు ద్వారా వేసే కరోనా చుక్కల మందు (నాసల్ కరోనా వ్యాక్సిన్)కు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీన్ని కోవిన్ యాప్‌లో చేర్చనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి మాన్సుక్ మాండవీయ వెల్లడించారు. పైగా, దీన్ని బూస్టర్ డోస్‌గా కూడా తీసుకోవచ్చని తెలిపారు. 
 
త్వరలోనే దేశంలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ నాసల్ కోవిడ్ వ్యాక్సిన్‌ను హైదరాబాద్ నగరంలోని భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీ అభివృద్ధి చేసింది. 
 
ఈ టీకాను శుక్రవారం సాయంత్రానికి కోవిన్ యాప్‌లో యాడ్ చేయనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు కూడా వెల్లడించాయి. ఇదే జరిగితే అధికారికంగా ఎవరైనా తీసుకోవచ్చు. టీకా సర్టిఫికేషన్ కూడా యాప్ నుంచి తీసుకోవడం సులభమవుతుంది. 
 
కాగా, కరోనా మొదటి, రెండు డోసులు తీసుకున్న వారు బూస్టర్ డోసులకు అర్హులు. అందువల్ల బూస్టర్ డోస్ వేయించుకోదలచిన వారు ఈ నాసల్ కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చు. అయితే, దీని ధరను ప్రకటించాల్సివుంది. 
 
ప్రస్తుతం మన దేశంలో కరోనాకు కోవాగ్జిన్, కోవిషీల్డ్, కోవోవ్యాక్స్, స్పుత్నిక్ వి, బయోలాజికల్ ఈ కార్బోవ్యాక్స్‌లు అందుబాటులో ఉన్న విషయం తెల్సిందే.