శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి

కాటేసిన పాము పట్టుకుని కొరికిన బీహార్ వారీ.. పాము చనిపోయింది.. మనిషి బతికాడు.. ఎక్కడ?

snake
సాధారణంగా పాములను చూస్తే ప్రతి ఒక్కరికీ భయం. అలాంటి పాము కాటేస్తే ఇంకేమైనా ఉంటుంది. పాము కాటుకు గురైన వ్యక్తి ప్రాణాలు పోయేంతలా భయపడిపోతాడు. అయితే, బీహార్ రాష్ట్రంలో మాత్రం ఓ విచిత్ర సంఘటన జరిగింది. తనను కాటేసిన పామును ఓ వ్యక్తి కొరికి చంపేశాడు. ఓ వ్యక్తిని పాము కాటువేయగా అతను ఏమాత్రం భయపడకుండా, తిరిగి దాన్ని పట్టుకుని గట్టిగా కొరికేశాడు. అది కూడా ఒకసారి కాదు.. ఏకంగా ఆరేడు సార్లు కొరికాడు. ఆ వ్యక్తి కొరుకుడు దెబ్బకు ఆ పాము తట్టుకోలేత ప్రాణాలు కోల్పోయింది. కానీ, కొరికిన వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. పాము కాటుకు గురైన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సంతోష్ లోహర్ అనే 35 ఏళ్ల యువకుడు రైల్వే కార్మికుడు. బీహార్‌లోని నవాడా జిల్లా రాజౌలీ పరిధిలో ఉన్న ఓ అడవి మధ్యన జరుగుతున్న రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో సహచరులతో కలిసి పనిచేస్తున్నాడు. గత మంగళవారం రాత్రి పని ముగించుకొని నిద్రపోయేందుకు సిద్ధమవుతుండగా ఓ పాము ఉన్నట్టుండి వచ్చి అతన్ని కాటేసింది. 
 
దీంతో లోహర్ వెంటనే పామును పట్టుకొని రెండుసార్లు కొరకగా అది చచ్చిపోయింది. మరోవైపు ఈ విషయం తెలియగానే అధికారులు వెంటనే లోహర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రాత్రంతా చికిత్స అనంతరం మర్నాడు ఉదయానికి అతను కోలుకున్నాడు.
 
ఇలా ఎందుకు చేశావని అడిగితే తన గ్రామంలో ఉన్న మూఢనమ్మకం గురించి లోహర్ చెప్పుకొచ్చాడు. పామును రెండుసార్లు కొరికితే అది కాటేయడం వల్ల మనిషి శరీరంలోకి చేరే విషం తిరిగి పాములోకి వెళ్లిపోతుందని నమ్మి అలా చేశానన్నాడు.