గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2020 (19:32 IST)

బీహార్ అసెంబ్లీ పోల్ : ఎన్డీయే కూటమి మధ్య ముగిసిన సీట్ల పంపిణీ

బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇందులోభాగంగా, ఎన్డీయే కూటమిలోని రాజకీయ పార్టీల మధ్య సీట్ల పంపిణీ సర్దుబాటు ఓ కొలిక్కివచ్చింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ వాటా 122 స్థానాలు కాగా, బీజేపీ వాటా 121 స్థానాలుగా ఒప్పందం ఖరారైంది. 
 
ఈ మేరకు మంగళవారం జేడీయు - బీజేపీల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని ఎన్డీయే పక్షాల సంయుక్త మీడియా సమావేశంలో నితీష్ కుమార్, సుశీల్ మోడీలు వెల్లడించారు. ఇదే అంశంపై వారు మాట్లాడుతూ, బీహార్ శాసన సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి పక్షాల మధ్య సీట్ల పంపకాలు ఖరారైనట్లు వెల్లడించారు. 
 
115 స్థానాల నుంచి జేడీయూ పోటీ చేస్తుందని నితీశ్ కుమార్ చెప్పగా, తమ వాటాగా వచ్చిన 122 స్థానాల్లో ఏడింటిని జీతన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థాన్ అవామ్ మోర్చాకు ఇస్తామన్నారు. 121 స్థానాల నుంచి బీజేపీ పోటీ చేసేందుకు అంగీకారం కుదిరిందని చెప్పారు. 
 
ఈ  సందర్భంగా నితీశ్ కుమార్ లోక్ జన శక్తి పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ చీఫ్ రాంవిలాస్ పాశ్వాన్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. జేడీయూ సహాయం లేకుండా ఆయన రాజ్యసభకు వెళ్ళారా? అని ప్రశ్నించారు. 
 
బీహార్ శాసన సభలో ఆ పార్టీకి ఉన్న స్థానాలు ఎన్ని? అని అడిగారు. ఆ పార్టీకి కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని, బీజేపీ, జేడీయూ కలిసి రామ్ విలాస్ పాశ్వాన్‌ను రాజ్యసభకు పంపించాయని ఆయన గుర్తుచేశారు.