గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 మే 2022 (12:56 IST)

రూ. 2,500 కోట్లు ఇస్తే సీఎం అవుతారు.. ఆఫరిచ్చారన్న కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే

basana gowda
basana gowda
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బాసనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన ఆరోపణలు చేశారు. కొంతమంది పవర్ బ్రోకర్లు ఢిల్లీ నుంచి తన వద్దకు వచ్చారని వివరించారు. 
 
రాష్ట్రానికి సీఎం కావాలంటే రూ. 2,500 కోట్లు ఇవ్వాలని, ఆ మొత్తం అందిస్తే రాష్ట్ర సీఎంగా అవుతారని ఆఫర్ ఇచ్చారని తెలిపారు. బెలగావి జిల్లాలోని రామదుర్గ్‌లో పంచమశాలి కమ్యూనిటీ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
తరుచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బాసనగౌడ పాటిల్ యత్నాల్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి షాకింగ్ కామెంట్లు చేయడం చర్చనీయాంశమైంది. 
 
ఢిల్లీ నుంచి కొందరు బ్రోకర్లు తన వద్దకు వచ్చారని, వారికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చాలా దగ్గర అని చెప్పారని పేర్కొన్నారు. రూ. 2,500 కోట్లు ఇస్తే తనను సీఎంగా చేసి కూర్చోబెడతామని నమ్మబలికారన్నారు. 
 
కానీ, తాను ఆ ఆఫర్‌ను తిరస్కరించానని, అసలు రూ. 2,500 కోట్లు అంటే ఎన్ని నోట్లు ఉంటాయో కూడా తనకు తెలియదని, అంతటి డబ్బును ఎవరైనా ఎక్కడ పెడతారని అడిగానని చెప్పారు.
 
కర్ణాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ వెంటనే ఆయన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. 
 
రూ. 2,500 కోట్లకు సీఎం కుర్చీ, రూ. 100 కోట్లకు సీఎం పదవి ఇస్తారని ఆయన పేర్కొన్నారని వివరించారు. యత్నాల్ మాజీ కేంద్రమంత్రి అని, ఆయన మాటలను సింపుల్‌గా తీసుకోరాదని కోరారు.