శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 మే 2024 (15:11 IST)

పార్లమెంట్‌లో బీజేపీ ఉన్నంతవరకు రిజర్వేషన్లు చెక్కు చెదరవు : అమిత్ షా

amit shah
పార్లమెంట్‌లో భారతీయ జనతా పార్టీ ఉన్నంతవరకు ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్లకు ఏ ఒక్కరూ హాని తలపెట్టరేని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కేంద్రంలో మరోమారు ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపడితే రిజర్వేషన్లను తొలగిస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. దీనిపై అమిత్ షా స్పందించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని, దేశ ప్రధానిగా మోడీ మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. కానీ, నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని అయితే రిజర్వేషన్లు తొలగిస్తారంటూ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. 
 
ఇదే అంశంపై హర్యానాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, పార్లమెంట్‌లో బీజేపీ ఉన్నంతవరకూ రిజర్వేషన్లను ఏ ఒక్కరూ కదిలించలేరన్నారు. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని ఎన్నికల అనంతరం బైనాక్యులర్స్ వెతికినా కాంగ్రెస్ కనిపించదని ఎద్దేవా చేశారు. కాషాయ పార్టీ రాజ్యాంగాన్ని మార్చివేస్తుందని, రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ దుష్ప్రచారం సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
కాంగ్రెస్ పార్టీ ఆరు దశాబ్దాలుగా అధికారంలో ఉన్నప్పటికీ బుజ్జగింపు రాజకీయాల కోసమే ఆర్టికల్ 370 రద్దు చేయలేదని విమర్శించారు. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదం పెరిగినా కాంగ్రెస్ ఆర్టికల్‌ను రద్దు చేయలేదన్నారు. పీవోకే ఖచ్చితంగా మనదేనని.. దానిని వెనక్కి తీసుకుంటామని పునరుద్ఘాటించారు. మైనార్టీ ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వంటి అగ్రనేతలు అయోధ్య బాలరాముడి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనలేదన్నారు.
 
'మీరంతా 2019లో నరేంద్ర మోడీని రెండోసారి ప్రధానిగా చేశారు. దీంతో ఆగస్టు 5, 2019న, మోడీ ఆర్టికల్ 370ని రద్దు చేశారు. ఇప్పుడు మన త్రివర్ణ పతాకం కాశ్మీర్‌లో సగర్వంగా రెపరెపలాడుతోందని వ్యాఖ్యానించారు. మల్లికార్జున ఖర్గేకు 80 ఏళ్లు వచ్చాయని... కానీ ఆయన ఇంకా మన దేశాన్ని అర్థం చేసుకోలేదని విమర్శించారు. హర్యానా యువత కాశ్మీర్ కోసం ప్రాణాలు అర్పించగలరన్నారు.