బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (10:28 IST)

జీవనాధారం లేని భర్తకు భార్య భరణం చెల్లించాల్సిందే.. బాంబే హైకోర్టు కోర్టు

జీవనాధారంలేని భర్తకు భార్య భరణం చెల్లించాలని బాంబే హైకోర్టు తీర్పును వెలువరించింది. సాధారణంగా విడాకుల కేసులో భార్యకు భర్త భరణం చెల్లించాలని కోర్టులు ఆదేశిస్తుంటాయి. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. జీవనాధారం లేని భర్తకు ప్రభుత్వ ఉద్యోగం చేసే భార్య భరణం చెల్లించాలని కోర్టులు ఆదేశించాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ తీర్పు వివవరాలను పరిశీలిస్తే, 
 
మహారాష్ట్రకు చెందిన ఓ మహిళకు గత 1992లో వివాహమైంది. వివాహం తర్వాత చదవును కొనసాగించి, ఉన్నత విద్యాభ్యాసం చేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా సంపాదించింది. ప్రస్తుతం ఆమె ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. అయితే, తన భర్త నిత్యం వేధిస్తున్నారంటూ అరోపిస్తూ భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె గత 2015లో నాందేడ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారించిన కోర్టు వారికి విడాకులు మంజూరుచేసింది. 
 
అసలు కథ ఇక్కడే ప్రారంభమైంది. తనకు ఎలాంటి జీవనాధారం లేదని, పెళ్లిన తర్వాత ఆమె చదువును కొనసాగించి ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించి మంచి వేతనం కూడా అందుకుంటుందని, అందువల్ల తన జీవనోపాధి కోసం భార్య నుంచి భరణం ఇప్పించాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన అదే కోర్టు భర్తకు ప్రతినెల 3 వేల రూపాయలు భరణంగా చెల్లించాలని 2017లో ఆమెను ఆదేశించింది. 
 
అయితే, కోర్టు ఆదేశాలను ఆమె ధిక్కరించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ఆమె ఇన్నాళ్లూ చెల్లించాల్సిన భరణం బకాయిల మేరకు ఆమె వేతనం నుంచి ప్రతినెల రూ.5 వేలు పక్కనపెట్టి ఆ సొమ్మును తమకు పంపాలంటూ 2019లో ఆమె పనిచేస్తున్న స్కూలు ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించింది. 
 
దీంతో ఆమె నాందేడ్ సివిల్ కోర్టు ఇచ్చిన రెండు తీర్పులను సవాలు చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. అయితే, అక్కడా ఆమెకు ఎదురుదెబ్బే తగిలింది. నాందేడ్ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు ధర్మాసనం.. జీవనాధారం లేని భర్తకు భార్య భరణం చెల్లించాల్సిందేనని స్పష్టమైన తీర్పు చెప్పింది.