1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఇది నిజమే... కట్నం సరిపోలేదని పెళ్ళిని రద్దు చేసుకున్న వధువు...!!!

marriage
అమ్మతోడు.. ఇది నిజం.. కట్నం సరిపోలేదని వధువు పెళ్ళిని రద్దు చేసుకుంది. పెద్దలు ఖరారు చేసిన  కట్నం సరిపోలేదని, అందువల్ల ఈ పెళ్లి చేసుకోనంటూ ఆ యువతి మొండికేసి, సరిగ్గా ముహుర్తానికి జంప్ అయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరంలోని పోచారం మునిసిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువకుడికి భద్రాద్రి జిల్లాకు చెందిన అశ్వారావుపేటకు చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. అమ్మాయికి రూ.2 లక్షల కట్నం ఇచ్చేలా కుల పెద్దల సమక్షంలో ఒప్పందం కుదిరింది. గత రాత్రి 7.21 గంటలకు పెళ్ళి జరగాల్సివుంది. అయితే, ఘట్‌కేసర్‌లోని ఓ ఫంక్షన్ హాలులో వివాహ ఏర్పాట్లు చేశారు. 
 
పెళ్ళి కోసం వరుడి తరపు కుటుంబ సభ్యులు కళ్యాణ మండపానికి చేరుకున్నారు. అయితే, ముహూర్తానికి సమయం మించిపోతున్నా వధువు తరపు వారి జాడ తెలియకపోవడంతో అనుమానించిన వరుడు తరపు బంధువులు ఆరా తీస్తే అసలు విషయం వెల్లడైంది. తనకు కట్నం సరిపోలేదని అదనపు కట్నం ఇస్తానంటేనే ఈ పెళ్లికి అంగీకరిస్తానని మొండికేసింది. 
 
పెళ్లికి సరిగ్గా గంట ముందు ఈ విషయం చెప్పడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తేరుకుని పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు యువతి తరపు వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. అయినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. కట్నం ఇస్తేనే పెళ్ళి చేసుకుంటానని వధువు తెగేసి చెప్పడంతో చివరకు పెళ్ళి రద్దు అయింది. అలాగే, వధువుకు కట్నం కింద ఇచ్చిన రూ.2 లక్షలను కూడా వరుడు తరపు వారు వదులుకున్నారు.