గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2024 (08:37 IST)

నేడు మధ్యంతర బడ్జెట్‌ .. విత్తమంత్రి నిర్మలమ్మ అరుదైన ఘనత!!

bugdet
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం గురువారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ అరుదైన ఘనతను సొంతం చేసుకోనున్నారు. ఇప్పటివరకు వరుసగా ఐదుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గురువారం ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్ ఆరోది కావడం గమనార్హం. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆమె పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే, తాజా బడ్జెట్‌లో మహిళలు, రైతులను ఆకర్షించే ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గురువారం మధ్యాహ్నం 11 గంటలకు ఆమె లోక్‌సభలో తన బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. 
 
ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది ఆరోసారి. ఈ క్రమలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును ఆమె సమం చేయనున్నారు. మొరార్జీ దేశాయ్ గత 1959 నుంచి 64 మధ్య కాలంలో ఆర్థిక మంత్రిగా ఉండగా, ఈయన ఐదుసార్లు వరుసగా వార్షిక బడ్జెట్‌ను, ఒకసారి మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. మొత్తంగా ఆయన పది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డును సృష్టించారు. అలాగే, గతంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హా వంటివారు కూడా వరుసగా ఐదుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇపుడు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్ ఆరోది కావడం గమనార్హం. 
 
కాగా, ప్రస్తుత లోక్‌సభకు ఇదే చివరి బడ్జెట్ కూడా. దీంతో ఎలాంటి ప్రకటనలు ఉంటాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఒకటి రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు వెళుతున్న సమయంలో రైతులు, మహిళలను ఆకట్టుకునే ప్రకటనలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను పూర్తస్థాయి వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనుంది.