శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 సెప్టెంబరు 2023 (13:44 IST)

భారత్‌కు వృద్దాప్యం వస్తుంది.. యువభారత్ కాస్తా వయసుమీరిన భారత్‌గా...

Old Age
Old Age
మన దేశంలో వయోధికుల సంఖ్య మరింతగా పెరిగిపోనుంది. ఫలితంగా ఈ శతాబ్ది చివరి నాటికి వృద్ధుల జనాభా అధికంగా ఉన్న దేశంగా భారత్ నిలుస్తుందని ఐక్యరాజ్య సమితి జనాభా నిధి వెల్లడించిన నివేదికలో పేర్కొంది. 
 
ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ మంది కిశోరప్రాయులు, యువత ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు 2021లో 10.1 శాతం ఉంటే 2036 నాటికి 15 శాతానికి, 2050కి 20.8 శాతానికి చేరుకుంటారని ఈ నివేదిక అంచనా. 2099 నాటికి ఇది ఎకాయెకి 36 శాతానికి చేరుతుంది. 15 ఏళ్లలోపు పిల్లల సంఖ్య తగ్గిపోవడం, వయోధికులు పెరగడమనేది 2010 నుంచి మొదలైంది. దేశానికి వృద్ధాప్యం వస్తోందనడానికి అదే సూచిక అని నివేదిక పేర్కొంది. 
 
'ఎక్కువ వయసున్నవారి జనాభా అనూహ్య రేటుతో పెరుగుతోంది. ఈ శతాబ్ది మధ్యనాటికే వీరి సంఖ్య పిల్లల కంటే ఎక్కువైపోతుంది. 2046 నాటికి 0-14 ఏళ్లలోపువారి సంఖ్య కంటే వృద్ధుల జనాభా ఎక్కువవుతుంది. యువభారత్ కాస్తా వయసుమీరిన భారత్‌గా మారుతుందనేది నిస్సందేహం' అని యూఎన్‌పీఏయే తెలిపింది. 
 
దక్షిణాదిలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో.. అటు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లో 2021 జాతీయ సగటు కంటే వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, అది 2036 నాటికి మరింత విస్తరిస్తుందని జనాభా నిధి అంచనాలు చెబుతున్నాయి. ఎక్కువ సంతాన సాఫల్య రేటు ఉంటున్న బిహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో 2021-36 మధ్య వృద్ధుల జనాభా శాతం జాతీయ సగటుకంటే తక్కువ ఉంటుంది.
 
1961 నుంచి ప్రతి దశాబ్దిలో వయోధికుల సంఖ్య ఒక మోస్తరు నుంచి అధికస్థాయి వరకు పెరుగుతూ వస్తోంది. 2001కి ముందు ఈ పెరుగుదల నెమ్మదించినా రాబోయే దశాబ్దాల్లో ఊపందుకుంటుంది. 2021 జనాభా అంచనాల ప్రకారం దేశంలో ప్రతి 100 మందిలో 39 మంది వృద్ధులున్నారు. దక్షిణాది, పశ్చిమ భారత ప్రాంతాలతో పోలిస్తే మధ్య, ఈశాన్య భారత ప్రాంతాల్లో యువత ఎక్కువగా ఉన్నారు.