చేతివృత్తుల వారికి రాయితీ... విశ్వకర్మ పథకానికి కేబినెట్ ఆమోదం
స్వాతంత్ర్య దినోత్సవ పండుగ రోజున చారిత్రక ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన విశ్వకర్మ పథకాన్ని (పీఎం విశ్వకర్మ పథకం)కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద చేతివృత్తుల వారికి రాయితీపై రుణాలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశ అనంతరం అందులో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
'విశ్వకర్మ పథకం కింద చేతివృత్తుల వారికి రాయితీపై రుణాలు మంజూరు చేయనున్నాం. గరిష్ఠంగా 5 శాతం వడ్డీరేటుతో ఈ రుణాలు పొందొచ్చు. ఇందుకోసం రూ.13 వేల కోట్లను కేంద్రం వెచ్చించనుంది' అని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
చేతివృత్తులు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారి కోసం ఈ పథకం కింద రెండు శిక్షణ కార్యక్రమాలను తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్న వారికి రోజుకు రూ.500 ఉపకార వేతనంతో మెరుగైన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ తర్వాత పరికరాల కొనుగోలు కోసం రూ.15 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు.
ఆ తర్వాత వడ్డీపై రాయితీతో తొలుత రూ.లక్ష రుణం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తొలి విడత సద్వినియోగం చేసుకుంటే రెండో విడత కింద రూ.2 లక్ష రుణం మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకంతో ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన సంప్రదాయ కళాకారులు, చేనేతకారులు, స్వర్ణకారులు, వడ్రంగులు, రజకులు, క్షురకుల కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబరు 17 నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.