సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (09:16 IST)

ప్రణబ్ మృతి : కేంద్రం కీలక నిర్ణయం - తొలి రోజు నుంచే మార్గదర్శకత్వం చేశారు.. మోడీ

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించారు. ఆయన మృతి నేపథ్యంలో కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రణబ్ మృతికి సంతాపసూచకంగా దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాప దినాలుగా పాటించాలని నిర్ణయించింది. ప్రణబ్ అందించిన సేవల దృష్ట్యా ఈ నిర్ణయం సముచితమని కేంద్రం భావిస్తోంది. 
 
అంతేకాకుండా, ప్రణబ్‌కు త్రివధ దళాల సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అటు, ప్రణబ్ మృతితో రాష్ట్రపతి భవన్, ఇతర కార్యాలయాలపై ఉన్న జాతీయ పతాకాలను అవనతం చేశారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆసుపత్రిపాలైన ప్రణబ్ ముఖర్జీకి శస్త్రచికిత్స జరుపగా, ఆయన పరిస్థితి విషమించింది. దానికితోడు కరోనా సోకడంతో ఆయన కోలుకోలేకపోయారు.
 
ఇకపోతే, ప్రణబ్ దాదా మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన ప్రగాఢ సంతాన్ని వ్యక్తం చేస్తూ, ప్రణబ్‌తో తనకున్న అనుబంధాన్ని ఓ ట్వీట్‌లో వెల్లడించారు. "2014లో ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పుడు నాకు ఢిల్లీలో అంతా కొత్త. అలాంటి సమయంలో మొదటి రోజు నుంచీ నాకు ప్రణబ్‌ ముఖర్జీ మార్గదర్శకత్వం, అండ, ఆశీస్సులు లభించడం అదృష్టం. ప్రణబ్‌ ముఖర్జీ మృతితో యావద్దేశం విషాదంలో మునిగిపోయింది. దేశ అభివృద్ధి పథంలో ప్రణబ్‌ చెరగని ముద్ర వేశారు" అని పేర్కొన్నారు.