నవ నిర్మాణ సేన జెండా మార్పు
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) జెండా మారింది. పూర్తిగా కాషాయ రంగు నేపథ్యంలో నలుపు రంగు అష్టభుజిపై పసుపు రంగు అక్షరాలతో ఉన్న రాజముద్రతో ఈ జెండా కనిపిస్తోంది.
ఛత్రపతి శివాజీ పరిపాలన సమయంలో రాజముద్రను వాడేవారు. అంతకు ముందు ఎంఎన్‌ఎస్ జెండాలో కాషాయం, నీలం, ఆకుపచ్చ రంగులు ఉండేవి. ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్ థాకరే గురువారం తన పార్టీ నూతన జెండాను ఆవిష్కరించారు.
వీర్ సావర్కర్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ప్రబోధాంకర్ థాకరే, ఛత్రపతి శివాజీల చిత్ర పటాలకు రాజ్ థాకరే పూల మాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం మెగా ర్యాలీని ప్రారంభించారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే జయంతిని ఆ పార్టీ కార్యకర్తలు గురువారం జరుపుకున్నారు.
రాజ్ థాకరేకు బాల్ థాకరే సమీప బంధువు అన్న సంగతి విదితమే.రాజ్ థాకరేతో ఇటీవల బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ అయ్యారు. దీంతో ఇరు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని చాలా మంది భావించారు.