శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 జులై 2021 (12:44 IST)

ఆర్టిఫీషియల్ పన్ను.. నీళ్లు తాగుతూ మింగేసింది.. ప్రాణం కోల్పోయింది..

ఇటీవలి కాలంలో రకరకాల సమస్యల వల్ల దంతాలు పాడైతే వాటిని తీసేసి ఆర్టిఫిషియల్ పళ్లు పెట్టించుకోవడం సహజంగా మారింది. ఇవి చూసేందుకు సహజమైన పళ్లలాగే ఉంటూ నమలడంలో సాయం చేయడంతో పాటు అందం తగ్గకుండా కాపాడతాయి. దీంతో చాలామంది వీటిని ఉపయోగిస్తున్నారు. అలాంటి ఓ పన్నే చెన్నైకి చెందిన ఓ మహిళ ప్రాణం పోయేలా చేసింది. నీళ్లు తాగుతుండగా గొంతులోకి వెళ్లి ఊపిరాడక ఆమె మరణించింది. కృత్రిమ పన్నును మింగడం వల్లే ఆమె చనిపోయిందని డాక్టర్లు ధృవీకరించారు. 
 
వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని వలసరవక్కం దగ్గర్లోని రామాపురం ప్రాంతానికి చెందిన రాజలక్ష్మి అనే మహిళ కృత్రిమ దంతాలు పెట్టించుకుంది. అయితే నీళ్లు తాగుతూ అనుకోకుండా ఆర్టిఫిషియల్ పన్నును కూడా మింగేసింది. దీంతో అది గొంతులో ఇరుక్కొని ఆమె మరణించింది. పోరూర్ ప్రాంతానికి చెందిన ఓ ఆసుపత్రిలో తన పళ్ల సమస్యకు చికిత్స తీసుకున్న 43 సంవత్సరాల రాజ్యలక్ష్మి మూడు ఆర్టిఫిషియల్ పళ్లు పెట్టించుకుంది. ఆ తర్వాత నీళ్లు తాగుతున్న సమయంలో ఈ మూడింటిలో ఒక పన్ను ఆమె గొంతు నుంచి లోపలికి వెళ్లిపోయింది.
 
ఆ తర్వాత కాసేపటికే ఆమెకు వాంతులు కావడం, కళ్లు తిరగడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. దీంతో వెంటనే దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తన భర్త సురేష్ సాయంతో వెళ్లిందామె. అక్కడ ఆమెకు స్కానింగ్ చేసిన వైద్యులు రిపోర్ట్‌లో ఏమీ కనిపించకపోయే సరికి వాంతులకు మందులు ఇచ్చి ఇంటికి పంపించేశారు. కానీ ఆ తర్వాత రోజు ఆమె మరోసారి కళ్లు తిరిగి పడిపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మరణించింది. ఆమె మృతిపై రాయల నగర్ పోలీసులకు సమాచారం అందించారు కుటుంబ సభ్యులు. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపించారు. 
 
పోస్టుమార్టంలో ఆమె ఆర్టిఫిషియల్ పన్నును వెలికితీశారు. దాన్ని మింగడం వల్లే చనిపోయిందని కూడా పోస్టుమార్టం రిపోర్టులో ఉండడం విశేషం. ఆమె మరణానికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయేమో అని కూడా పోలీసులు విచారించారు. అయితే పన్ను మింగడమే కారణం అని నిర్ధారించుకున్న తర్వాత వారు కూడా కేసు మూసేశారు.
 
అయితే పన్ను మింగడం వల్ల మరణం ఎలా సాధ్యమైందని చాలామంది అనుమానపడుతున్నారు. కానీ పన్నులాంటి పదునైన భాగం అనుకోకుండా శ్వాసనాళాల్లోకి చేరడం వల్ల ఊపిరి సరిగ్గా ఆడకపోవడం, శ్వాస నాళాలను అది డ్యామేజ్ చేయడం వల్ల రక్తస్రావం అయ్యి మరణానికి దారి తీస్తుందని డెంటిస్టులు వెల్లడిస్తున్నారు.