మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 జులై 2020 (19:23 IST)

చైనా బలగాలు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాయి? ఎవరైనా చెప్పగలరా? చిదంబరం

భారత భూభాగమైన గాల్వాన్ లోయ నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లిపోయాయంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిపై కేంద్రం మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందించారు. చైనా బలగాలు ఎక్కడ నుంచి ఎక్కడకి వెళ్లాయి? ఎవరైనా చెప్పగలరా? కేంద్రం చెబితే వినాలని వుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. 
 
గాల్వన్ లోయలోని సమస్యాత్మక ప్రాంతం నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లినట్టు మీడియాలో వార్తలపై చిదంబరం బుధవారం స్పందిస్తూ, చైనా బలగాలు వెనక్కి వెళ్లాయన్న దానిపై వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నానని పేర్కొన్నారు.
 
'చైనా బలగాలు వెనక్కి మరలడాన్ని స్వాగతిస్తున్నాను. అయితే, ఏ ప్రదేశం నుంచి చైనా వెనక్కి వెళ్లింది... ఇప్పుడు ఎక్కడికి వెళ్లింది? ఈ వివరాలను నాకు ఎవరైనా చెబుతారా?" అని అడిగారు. ఈ వివరాలను తాను కేంద్రం నోట వినాలనుకుంటున్నానని చిదంబరం వ్యాఖ్యానించారు.
 
"ఒకవేళ మన దళాలు కూడా వెనక్కి మరలాయనుకుంటే అది ఎక్కడ్నించి? చైనా వెనక్కి మరలిన ప్రాంతం నుంచే భారత బలగాలు కూడా వెనక్కి మరలాయా? లేక, భారత బలగాలు కానీ, చైనా బలగాలు కానీ ఎల్ఏసీకి అట్నుంచి ఇటో, ఇట్నుంచి అటో వెళ్లాయా? నాకు ఈ ప్రశ్నలన్నింటికి జవాబులు కావాలి. అసలు జూన్ 15న ఏం జరిగిందన్న దానిపై భారతీయులందరూ తహతహలాడిపోతున్నారు" అంటూ చిదంబరం ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.