మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 30 సెప్టెంబరు 2020 (08:49 IST)

ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా

దేశ వ్యాప్తంగా పది సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి 15 మందిలో ఒకరికి ఇప్పటికే కరోనా సోకినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి-ఐసిఎంఆర్‌) అంచనా వేసింది. ఆ సంస్థ దేశ వ్యాప్తంగా నిర్వహించిన రెండవ సెరో సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 
 
సర్వే ఫలితాల ప్రకారం ఇంకా పెద్ద సంఖ్యలో జనాభాకు కరోనా సోకే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నట్లు ఐసిఎంఆర్‌ డిజి బలరాం భార్గవ  చెప్పారు. కరోనా వ్యాప్తి ప్రారంభమైన తరువాత మే 11 నుండి జూన్‌ 4 మధ్య దేశ వ్యాప్తంగా 70 జిల్లాల్లోని 700 గ్రామాలు , వార్డుల్లో తొలివిడత సెరో సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే.

అప్పట్లో 0.73 శాతం మంది ప్రజలకు కరోనా సోకినట్లు తేలింది. తాజాగా అవే గ్రామాలు, వార్డుల్లో రెండవ విడత సెరో సర్వేని నిర్వహించారు. సర్వేలో భాగంగా ఐసిఎంఆర్‌ సిబ్బంది దాదాపుగా 29 వే ల మంది నుండి వివరాలు సేకరించారు. వీరిలో 6.6 శాతం మంది కరోనా బారిన పడ్డారని భార్గవ తెలిపారు. వీరంతా పది సంవత్సరాల పైబడిన వారని మాత్రమే ఆయన చెప్పారు.

ఆ తరువాత వయస్సుల వారీ వర్గీకరణను, స్త్రీ-పురుషుల నిష్పత్తిని వెల్లడించలేదు. అయితే, పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో 15.6శాతం మందికి, ఇతర ప్రాంతాల్లో 8.2శాతం మంది కరోనా బారిన పడినట్టు ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 4.4శాతం మందికి ఇప్పటికే వైరస్‌ సోకిందని, వయోజనుల్లో 7.1శాతం మంది కరోనా బారిన పడ్డారని వివరించారు.

ఈ సర్వే ప్రకారం మే నెలలో కన్నా ఆగస్టులో పరీక్షలు, డిటెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మరోవైపు పండుగల సీజన్‌తో పాటు, చలికాలం కూడా రానుండటంతో ముప్పు పొంచే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ, నీతి అయోగ్‌లు హెచ్చరించాయి. 'పండుగల సందర్భంగా కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలి.

మాస్క్‌లు,భౌతికదూరం పాటించడంతో పాటు, చేతులను తరచు శుభ్రం చేసుకుంటూ ఉండాలి' అని నీతిఅయోగ్‌ (ఆరోగ్య విభాగపు) సభ్యుడు డాక్టర్‌ వికె పాల్‌ అన్నారు. చలికాలంలో వైరస్‌ వ్యాపించడానికి ఎక్కువ అవకాశాలున్నాయని ఆయన చెప్పారు.