శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2022 (12:14 IST)

హిందీని నిర్బంధం చేస్తే.. దేశం మూడు ముక్కలే : సీఎం స్టాలిన్ హెచ్చరిక

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పాలకులకు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ గట్టివార్నింగ్ ఇచ్చారు. ఒకే దేశం ఒకే భాష కింద దేశ ప్రజలపై హిందీ భాషను నిర్బంధం చేసి దేశ ప్రజలపై బలవంతంగా రుద్దాలని చూస్తే మాత్రం దేశం మూడు ముక్కలు అవుతుందని హెచ్చరించారు. హిందీ నిర్బంధ అమలును వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. 
 
ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సారథ్యంలోని అధికార భాషా పార్లమెంటరీ కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒక నివేదికను అందజేసిందని, ఆ నివేదికలో ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో హిందీ శిక్షణ భాషగా ఉండాలని సిఫార్సు చేసినట్టు తెలిసిందన్నారు. ఇంగ్లీష్‌కు బదులుగా హిందీలో శిక్షణ జరగాలని ప్రతిపాదించినట్టు పేర్కొన్నారు. ఇదే నిజమైతే  ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. 
 
ఒకే దేశం ఒకే భాష నినాదంతో ఇతర భాషలను అణిచివేసేందుకు కేంద్రం యత్నిస్తుందంటూ మండిపడ్డారు. ఆంగ్ల భాషను పూర్తిగా తొలగించే దిశగా అడుగులు వేస్తుందన్నారు. నిజానికి దేశంలో హిందీని నిర్బంధం చేసే పనులు గత 1938 నుంచి జరుగుతూనే ఉన్నాయని, ఆ ప్రయత్నాలను తాము అడ్డుకుంటూనే ఉన్నామని తెలిపారు. తమిళ భాష, తమిళ సంస్కృతిని కాపాడుకోవడానికి ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ఆయన తెలిపారు. పైగా, హిందీని నిర్బంధం చేస్తే మాత్రం దేశం మూడు ముక్కలు అవుతుందని ఆయన హెచ్చరించారు.