శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 అక్టోబరు 2022 (16:42 IST)

ఇక.. హిందీలో వైద్య విద్యా కోర్సు బోధన.. పుస్తకాలు విడుదల

hindi mbbs textbooks
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ పాలిత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య విద్యను హిందీ మాధ్యమంలో కొనసాగించనుంది. ఇందుకు సంబంధించి వైద్య విద్యా కోర్సుకు చెందిన హిందీ పుస్తకాలను ముద్రించింది. వీటిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం రిలీజ్ చేశారు. దీంతో హిందీలో ఎంబీబీఎస్‌ కోర్సు ప్రారంభించిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ నిలిచింది.
 
మధ్యప్రదేశ్‌లో 2022-23 విద్యా సంవత్సరానికిగాను ప్రభుత్వ మెడికల్‌ కళాశాల్లోని మొదటి ఏడాది విద్యార్థులకు హిందీలో మెడిసిన్‌ను బోధించనున్నారు. ఇందులో భాగంగా అనాటమీ, ఫిజియోలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టుల పుస్తకాలు హిందీలో అందుబాటులోకి తెచ్చారు. 
 
ఈ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.. మెడికల్‌, ఇంజినీరింగ్‌ కోర్సులను హిందీలో నేర్చుకోలేమనే భావనను తొలగించేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. హిందీ మాధ్యమంలో చదివి కూడా జీవితంలో ముందుకు సాగగలమనే ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు ఇదో ముందడుగని అన్నారు. 
 
మాతృభాషలోనే విద్యా బోధన ఉండాలనేది ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పమని సీఎం శివరాజ్‌ సింగ్‌ అంతకుముందు వ్యాఖ్యానించారు.‌ ఆంగ్లంతోపాటు హిందీ పుస్తకాలు అందుబాటులో ఉంటాయని, సాంకేతిక పదాలు మాత్రం ఇంగ్లీష్‌లోనే ఉంటాయని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ స్పష్టం చేశారు. దేశంలో ఎంబీబీఎస్‌ కోర్సును హిందీలో తీసుకువచ్చిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ నిలిలిందన్నారు.