1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 అక్టోబరు 2022 (09:48 IST)

హైదరాబాద్ పారిశ్రామికవేత్త హత్య కేసు - ముద్దాయిలకు జీవితఖైదు

court
బెంగళూరులో పదేళ్ల క్రితం తీవ్ర సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ పారిశ్రామికవేత్త, మాజీ ముఖ్యమంత్రి దివంగత కె.రోశయ్య బంధువు మనోజ్‌కుమార్‌ గ్రంధి (44) హత్యకేసులో ముద్దాయిలుగా తేలిన ముగ్గురు నిందితులకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు నగర 52వ అదనపు సివిల్‌, సెషన్స్‌ న్యాయస్థానం న్యాయమూర్తి బీజీ ప్రమోద్‌ తీర్పునిచ్చారు. 
 
ఈ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే, గత 2012 ఫిబ్రవరి 6న ఇండిగో విమానంలో హైదరాబాద్‌ నుంచి మనోజ్‌కుమార్‌ గ్రంధి బెంగళూరు చేరుకున్నారు. ఓ కారును అద్దెకు తీసుకున్నారు. డ్రైవర్‌ రవికుమార్‌ ఆ కారు నడిపాడు. ఆ సమయంలో మనోజ్‌ వెంట తెచ్చిన సంచులలో కోట్ల రూపాయల విలువచేసే బంగారు నగలు ఉన్నట్లు డ్రైవర్ గుర్తించాడు. 
 
రవికుమార్‌కు ఆ నగలపై ఆశ పుట్టుకొచ్చి కృష్ణగౌడ, శివలింగయ్య అనే ఇద్దరు మిత్రులకు సమాచారం చేరవేశాడు. బళ్లారి రోడ్డులోని విండ్సర్‌ మ్యానర్‌ వంతెన వద్ద మనోజ్‌ కుమార్‌కు కత్తులు చూపి బెదిరించి, తాడుతో గొంతుకు బిగించి హత్యచేశారు. 
 
ఆ మృతదేహాన్ని మంగళూరు మార్గంలోని చార్మాడి కొండల్లో పడేశారు. మనోజ్‌ పుస్తకాలు, ఇతర వస్తువులను కాల్చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన శేషాద్రిపురం పోలీసులు నిందితులను అరెస్టుచేసి రూ.2 కోట్ల విలువ చేసే బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు అప్పట్లో ఉభయ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ కేసులో తుదితీర్పు తాజాగా వెలువడింది.