శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 సెప్టెంబరు 2020 (15:29 IST)

మంచినీళ్లు అడిగిన పాపానికి కోవిడ్ రోగిపై దాడి.. వీడియో వైరల్

మంచినీళ్లు అడిగిన పాపానికి ఓ కోవిడ్ రోగి పట్ల వైద్య సిబ్బంది చితకబాదిన ఘటన రాజ్‌కోట్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ బాధితుడు మృతి చెందినట్లు అతని కుటుంబీకులు చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రభాకర్‌ పాటిల్‌ అనే వ్యక్తి రాజ్‌కోట్‌ ప్రాంతంలోని ఓ కంపెనీలో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. 
 
పరీక్షల అనంతరం అతడి కిడ్నీలో నీరు చేరిందని ఆపరేషన్‌ చేయాలని తెలిపారు వైద్యులు. దాంతో ప్రభాకర్‌ రెండు వారాల క్రితం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి కిడ్నీ ఆపరేషన్‌ చేయించుకున్నాడు. సమస్య తీరిపోయింది అనుకుంటుండగా.. ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దాంతో వైద్యులు అతడికి కరోనా టెస్టులు చేయడంతో పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో ప్రభాకర్‌ సెపప్టెంబర్‌ 8న రాజ్‌కోట్‌ కోవిడ్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. 
 
ఈ క్రమంలో తాగేందుకు మంచి నీళ్లు ఇవ్వాల్సిందిగా నర్సింగ్‌ సిబ్బందిని కోరాడు. దాంతో వారు ప్రభాకర్‌పై దాడి చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నర్సింగ్‌ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు కలిసి ప్రభాకర్‌ మీద దాడి చేయడం చూడవచ్చు. ఇకపోతే, ప్రభాకర్‌ ఈ నెల 12న మరణించాడు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.