మరింతగా కొట్టుకోండి.. ఒకరిని ఒకరు అంతం చేసుకోండి.. 'ఇండియా'పై సీఎం ఒమర్ ట్వీట్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తనదైనశైలిలో స్పందించారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 23 యేళ్ల తర్వాత అధికారాన్ని కైవసం చేసుకుంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ఓటర్లు కర్రుకాల్చివాతపెట్టారు. ఇక ఒకపుడు ఢిల్లీ పీఠాన్ని శాంసించిన కాంగ్రెస్ పార్టీ సోదిలో కూడా లేకుండా పోయింది.
మొత్తం 70 స్థానాలకుగాను బీజేపీ 48, ఆప్ 22 స్థానాలను దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీకి ముచ్చటగా మూడోసారి కూడా ఒక్క సీటు కూడా రాలేదు. ఈ ఫలితాలపై జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమిలోని వివిధ రాజకీయ పార్టీల నేతలను ఉద్దేశించి ఆయన ఈ ట్వీట్ చేశారు.
"మీకు నచ్చినట్టుగా మరింతగా కొట్టుకోండి. ఒకరిని ఒకరు అంతం చేసుకోండి. మిగిలిన రాష్ట్రాలను కూడా బీజేపీ తన్నుకుపోతుంది" అంటూ చురక అంటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అప్, కాంగ్రెస్ పార్టీలు అనుసరించిన తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఓ మీమ్‌ను జోడించారు.