విమానాల్లో సీటింగ్.. కొత్త నిబంధన : డీజీసీఏ ఆదేశాలు
విమానాల్లో సీట్ల కేటాయింపునకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ - డీజీసీఏ సరికొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. 12 యేళ్లలోపు పిల్లలకు సీట్లను వారివారి తల్లిదండ్రుల పక్కనే కేటాయించాలని కోరారు. 12 ఏళ్ల చిన్నారులకు అదే పీఎన్‌ఆర్ నంబర్‌పై ప్రయాణిస్తున్న తల్లిదండ్రులు లేదా సంరక్షకుల్లో ఒకరి పక్కన సీటు కేటాయించాలని సూచించింది. విమానాల్లో కొన్నిసార్లు చిన్నారులకు తల్లిదండ్రులతో కాకుండా వేరుగా సీటు కేటాయిస్తున్న ఉదంతాల నేపథ్యంలో డీజీసీఏ ఈ ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించిన రికార్డులను నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు నిబంధనలు సవరిస్తూ సర్క్యులర్ జారీ చేసింది.
అలాగే, విమాన సంస్థలకు సంబంధించి కొన్ని వెసులుబాట్లు కూడా కల్పించింది. జీరో బ్యాగేజీ, సీట్ల ప్రాధాన్యం, మీల్స్/స్నాక్స్/ డ్రింక్స్, సంగీత వాయిద్య పరికరాల తీసుకెళ్లడానికి రుసుములు వసూలు చేసుకోవచ్చని తెలిపింది. అయితే, ఐచ్ఛికంగా ఉండాలని సూచించింది. తప్పనిసరి చేయకూడదని తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. సాధారణంగా విమానాల్లో వెబ్ చెక్ ఇన్ ఆప్షన్ ఉంటుంది. ఆ సమయంలో నచ్చిన సీటును ప్రయాణికుడు ఎంచుకునే వెసులుబాటు ఉంది. ఒకవేళ ఏ సీటూ ఎంచుకోకపోతే వారికి ఆటో సీట్ అసైన్‌మెంట్ నిబంధన వర్తిస్తుందని గుర్తుచేసింది.