కాంగ్రెస్ పార్టీలోకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్?
జాతీయ స్థాయిలో మంచి ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రశాంత్ కిశోర్ చేరికకు సంబంధించి పలువురు సీనియర్ నేతలు ఇప్పటికే అధినేత్రి సోనియాగాంధీతో చర్చించారని, త్వరలోనే ఆమె తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
అయితే, ప్రశాంత్ కిశోర్ చేరికను కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ, మరికొందరు మాత్రం ఆయన చేరికను ఆహ్వానిస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లోకి వస్తే మేలే జరుగుతుందంటున్నారు.
అయితే, పార్టీ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గతంలో సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది పీకే రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో పీకేను పార్టీలో చేర్చుకోవాలా? వద్దా? అన్న విషయంలో త్వరలోనే సోనియాగాంధీ ఓ నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
కాగా, బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ కిషోర్ గతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీఎస్‌లో చేరారు. ఆ తర్వాత అక్కడ ఇమడలేక పార్టీకి రాజీనామా చేశారు. అలాగే, పలు రాష్ట్రాల్లో విపక్ష పార్టీలు అధికారంలోకి రావడంలో కీలక పాత్రను పోషించారు.