గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 జులై 2021 (12:49 IST)

పెగాసస్ హ్యాకింగ్‌పై దుమారు.. నా ఫోన్ పలుమార్లు హ్యాకింగ్ : పీకే

దేశవ్యాపంగా సంచలనం సృష్టించిన పెగాసస్ హ్యాకింగ్‌ బాధితుల జాబితాలో మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ, వివిధ రాష్ట్రాల్లో బీజేపీకి గెలుపును దూరం చేస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్‌, ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ఫోన్లు, ప్రహ్లాద్‌ పటేల్‌ సన్నిహితులకు చెందిన 18 నంబర్లు కూడా హ్యాక్‌ అయ్యాయని 'ద వైర్‌' వార్తా సంస్థ మరో సంచలన కథనాన్ని ప్రచురించింది. 
 
కేంద్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ అశోక్‌ లావాసా, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ, ప్రముఖ వైరాలజిస్టు గగన్‌ దీప్‌ కాంగ్‌, ఎన్నికల వాచ్‌డాగ్‌ ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌)’ వ్యవస్థాపకుడు జగ్‌దీప్‌ చోఖర్‌.. ఇలా చాలా మంది పెగాసస్‌ నిఘా నీడన ఉన్నారని తెలిపింది. 
 
పైగా, ఎవరెవరి ఫోన్లు ఎప్పుడెప్పుడు హ్యాకింగ్‌కు గురయ్యాయో కూడా తెలిపింది. ఆ కథనం ప్రకారం.. రాహుల్‌ గాంధీపై 2018 మే/జూన్‌ నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో, ఆ తర్వాత కూడా నిఘా పెట్టారు. రాహుల్‌ ఉపయోగించిన రెండు నంబర్లతో పాటు ఆయన స్నేహితుల్లో ఐదుగురికి, పార్టీ విషయాల్లో ఆయనతో సన్నిహితంగా పనిచేసే ఇద్దరు సహాయకులు అలంకార్‌ సవాయ్‌, సచిన్‌రావుకు సంబంధించిన తొమ్మిది నంబర్లపై నిఘా పెట్టారు. 
 
ఈ హ్యాకింగ్‌పై ఎన్నిక వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. తన ఫోన్ పలుమార్లు హ్యాకింగ్ కు గురైనట్టు ఆయన తెలిపారు. ఇప్పటివరకు తన ఫోన్‌ను ఐదుసార్లు మార్చానని... అయినప్పటికీ తన ఫోన్ హ్యాకింగ్‌కు గురవుతూనే ఉందని చెప్పారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆయన ఫోన్ ఈ నెల 14న హ్యాకింగ్‌కు గురైంది. కాంగ్రెస్ కీలక నేతలతో ఆయన చర్చలు జరుపుతున్న సమయంలో ఫోన్ హ్యాక్ అయిందని తెలిపింది.
 
ఇపుడు ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇది దేశాన్ని పెగాసిస్ స్పైవేర్ కుదిపేస్తోంది. పార్లమెంటును సైతం ఈ విషయం షేక్ చేస్తోంది. లోక్‌సభ, రాజ్యసభల్లో ఇతర విషయాలను పక్కన పెట్టి ఈ స్పైవేర్‌పై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం విపక్షాల డిమాండ్‌ను తోసిపుచ్చుతోంది.