ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 డిశెంబరు 2020 (09:25 IST)

ముందు ఆ పనే.. జయలలిత మృతి మిస్టరీని వెలికితీస్తాం.. స్టాలిన్ కుమారుడు

డీఎంకే అధికారం చేపట్టిన వెంటనే దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి వెనుక వున్న మిస్టరీని వెలికితీస్తామని ఆ పార్టీ యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్‌ తెలిపారు.

డీఎంకే చేపట్టిన ఎన్నికల ప్రచారంలో భాగంగా కడలూరు జిల్లాలో ఉదయనిధి రెండవ రోజైన బుధవారం శ్రీముష్ణంలో పర్యటించారు. ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పాలన సాగిస్తున్న అన్నాడీఎంకే, బీజేపీ అదుపాజ్ఞలకు అనుగుణంగా పనిచేస్తోందని ఆరోపించారు.

బీజేపీ ప్రభుత్వం తమిళుల హక్కులు కాలరాసే చర్యలు చేపట్టిందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాదరణతో డీఎంకే కూటమి మొత్తం 234 స్థానాలు చేజిక్కించుకొని స్టాలిన్‌ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించనున్నారన్నారు.
 
మరోవైపు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చెల్లించాల్సిన పన్ను బకాయిల వివరాలందించేలా ఆదాయపుపన్ను శాఖకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఆమె మేనల్లుడు జె.దీపక్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

జయ ఆస్తుల నిర్వహణ హక్కులు అప్పగించాలని, లేదా నిర్వాహకులను నియమించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో అన్నాడీఎంకే ప్రతి నిధులు పుహళేంది, జానకిరామన్‌ వేసిన పిటిషన్‌ను గత మే నెలలో విచారించిన న్యాయమూర్తులు జస్టిస్‌ కృపాకరన్‌, జస్టిస్‌ అబ్దుల్‌ఖుద్ధూస్‌లతో కూడిన ధర్మాసనం.. వారికి నిర్వహణ హక్కులు కల్పన, నిర్వాహకుల ఏర్పాటుకు నిరాకరించింది. అదే సమయంలో జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌లను వారసులుగా ప్రకటించింది. అలాగే, జయ ఆస్తుల నిర్వహణకు ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని న్యాయమూర్తులు ఉత్తర్వులు జారీ చేశారు.
 
అనంతరం, పోయస్‌ గార్డెన్‌లోని జయ నివాసమైన 'వేద నిలయం'ను స్మారక మందిరంగా మార్చాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దీపక్‌, దీపలు దాఖలుచేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది.

వేద నిలయం స్థలానికి సంబంధించి రూ.67 కోట్ల 90 లక్షల 52 వేల 33 నగదును చెన్నై సెషన్స్‌ కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం జమచేసింది. ఆ నగదులో రూ.36 కోట్ల 87 లక్షల 23 వేల 462ను జయ పన్ను బకాయిలు అని, మిగిలిన సొమ్మును ఇద్దరికి అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఈ నేపథ్యంలో, జయ చెల్లించాల్సిన బకాయిల వివరాలు అందజేయాలని దీపక్‌ ఆదాయపు పన్ను శాఖను కోరగా, ఇప్పటివరకు ఆ శాఖ ఎలాంటి వివరాలు అందజేయలేదని సమాచారం. దీంతో, తాను కోరిన జయ బకాయి వివరాలందించేలా ఆదాయపు పన్ను శాఖకు ఉత్తర్వులు జారీ చేయాలని దీపక్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

దీనిని అత్యవసరంగా బుధవారం విచారణ చేపట్టాలంటూ దీపక్‌ తరపు న్యాయవాది అభ్యర్థనను న్యాయమూర్తి జస్టిస్‌ అనిత తిరస్కరించారు. ఆ పిటిషన్‌ను స్వీకరించి, యధావిధిగా జాబితాలో పెట్టాలని రిజిస్ట్రీని ఆదేశించారు.