శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 మే 2020 (18:00 IST)

25న నుంచి దేశీయ విమాన సర్వీసులు - 'కరోనా' రికవరీ రేటు భేష్

దేశ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఈ నెల 25వ తేదీ నుంచి దేశీయ విమాన సర్వీసులు నడిపేందుకు అనుమతి ఇచ్చింది. మే 25వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ట్వీట్ చేశారు. 
 
అన్ని విమానాశ్రయాల్లో మే 25 నుంచి సేవలను పునరుద్ధరించి.. ప్రయాణికులకు అందుబాటులో ఉండేందుకు సిద్ధం కావాలని ఆయన ఆదేశించారు. అయితే.. దశలవారీగా విమానాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. 
 
అయితే.. అన్ని నగరాల మధ్య రాకపోకలకు అవకాశం ఇస్తారా, లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. ఇప్పటికే వందేభారత్ మిషన్‌లో భాగంగా ఇతర దేశాల నుంచి భారత్‌కు విమానాల్లో ప్రయాణికులను తరలిస్తున్న సంగతి తెలిసిందే.
 
మరోవైపు, కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో రికవరీ రేటు సంతృప్తికరంగా ఉందన్నారు. భారత్‌లో కరోనా ప్రభావానికి సంబంధించి బుధవారం ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. 
 
భారత్‌లో ఇప్పటివరకూ 42,298 మంది కరోనా నుంచి కోలుకున్నారని.. ఇది కొంత సంతృప్తికర విషయమని ఆయన చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో 61,149 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆయన తెలిపారు. 
 
ప్రపంచ మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుంటే లక్ష మందిలో 62 మంది కరోనా బారిన పడ్డారని ఆయన చెప్పారు. అదే భారత్‌లో.. లక్షకు 8 మందికి మాత్రమే కరోనా సోకినట్లు తేలిందని లవ్ అగర్వాల్ వెల్లడించారు. 
 
భారత్‌లో లాక్డౌన్ అమలైన కొత్తలో రికవరీ రేటు 7 శాతంగా ఉందని.. అదే ఇప్పుడు 39.6 శాతానికి పెరిగిందని చెప్పారు. లాక్డౌన్ 1 నాటికి 7.1 శాతం, లాక్డౌన్ 2.0 నాటికి 11.42 శాతం, లాక్డౌన్ 3.0 నాటికి 26.59 శాతంగా ఉన్న రికవరీ రేటు లాక్డౌన్ 4.0 నాటికి 39.62 శాతానికి పెరిగిందని లవ్ అగర్వాల్ ప్రకటించారు.