ఉత్తరప్రదేశ్‌లో మరో ఎన్‌కౌంటర్.. గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానా హతం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానాను యూపీ ఎస్‌టీఎఫ్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఇక్కడి మీరట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ యూపీకి చెందిన అనిల్ దుజానాపై 18 హత్యలతోపాటు దోపిడీలు, భూకబ్జాలు తదితర నేరాలకు సంబంధించి 62 వరకు కేసులున్నాయి.
అలాగే, అతడిపై బులంద్‌శహర్ పోలీసులు రూ.25 వేలు, నోయిడా పోలీసులు అతనిపై రూ.50 వేల రివార్డు ప్రకటించారు. ఓ హత్య కేసులో ఇటీవలే జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అనిల్... తనపై కేసుల్లోని సాక్షులను బెదిరించినట్లు సమాచారం. దీంతో అతడిని అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించగా.. ఈ క్రమంలోనే ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మరోవైపు, ఉమేశ్‌పాల్ హత్య కేసులో ఇటీవలే గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ కుమారుడు అసద్, మరో నిందితుడు గుల్హామ్‌లు పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో హతమైన విషయం తెలిసిందే. తదనంతరం అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్‌లను ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. ఇది జరిగిన కొన్ని రోజులకే తాజాగా అనిల్ దుజానా ఎన్‌కౌంటర్ జరగడం గమనార్హం. కాగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కారు గ్యాంగ్‌స్టర్లపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెల్సిందే.