ఆదివారం, 10 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్

మద్యం మత్తులో వాచ్‌మెన్‌ను 3వ అంతస్తు నుంచి కిందకు తోసేసిన డ్యాన్సర్లు..

crime scene
హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్ శ్రీనగర్ కాలనీలో దారుణం జరిగింది. నలుగురు డ్యాన్సర్లు ఓ వాచ్‌మెన్‌ను చంపేశారు. మద్యం మత్తులో వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. తాగి గొడవ చేయొద్దన్నందుకు వాచ్‌మెన్‌ను మూడో అంతస్తు నుంచి మణి అనే డ్యాన్సర్ కిందకు తోసేయడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. చెన్నై నుంచి వచ్చిన నలుగురు డ్యాన్సర్లు శ్రీనగర్ కాలనీలోని శ్రీ రాఘవ గెస్ట్ హౌస్‌లో బస చేశారు. వీరు ఈ లాడ్జీ మూడో అంతస్తులోని గదిని అద్దెకు తీసుకున్నారు. అక్కడ పీకల వరకు మద్యం సేవించి, ఇతర గదుల్లో ఉండే వారికి ఇబ్బంది కలిగేలా గోల చేశారు. దీన్ని గమనించిన వాచ్‌మెన్ యాదయ్య.. ఆ గదికి వెళ్లి, గోల చేయొద్దంటూ కోరాడు. కానీ, మద్యంమత్తులో ఉన్న నలుగురు డ్యాన్సర్లు.. యాదయ్యతో గొడవపెట్టుకుని వాగ్వాదానికి దిగారు. 
 
ఇంతలో మణి అనే డ్యాన్సర్ ఆగ్రహంతో ఊగిపోతూ యాదయ్యను మూడో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. దీంతో ఆయన ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణలో డ్రగ్స్‌తో పాటు మద్యం సేవించడంతో పూర్తిస్థాయి మత్తులోకి వెళ్లిన డ్యాన్సర్లు.. వాచ్‌‍మెన్‌తో గొడవపడి ఈ దారుణానికి పాల్పడినట్టు చెప్పారు. బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు డ్యాన్సర్లను అరెస్టు చేయగా, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.