ఎమర్జెన్సీ రాజ్యాంగ విరుద్ధం కాదు.. అప్రజాస్వామికమే .. కాంగ్రెస్ నేత శశిథరూర్
దివంగత ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో ఎమర్జెన్సీని విధించారు. దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఈ చర్యను ఆయన తప్పుబడుతుంటే కాంగ్రెస్ నేతలు నేతలు మాత్రం ధీటుగా సమాధానం ఇస్తున్నారు.
తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ స్పందించారు. ఎమర్జెన్సీ విధింపు అప్రజాస్వామికమే కానీ రాజ్యంగ విరుద్ధం మాత్రం కాదన్నారు. అయితే, ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ చర్యలను మాత్రం ఆయన ఖండించారు. ఎమర్జెన్సీ పేరిట ప్రజల దృష్టి అసలు సమస్యలపై నుంచి మళ్లించేందుకు ప్రయత్నిస్తోదంటూ బీజేపీపై దుమ్మెత్తిపోశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, స్పీకర్ ఓం బిర్లా ప్రసంగాల్లో ఎమర్జెన్సీ ప్రస్తావన తెచ్చారు. దీనిపై ఆయన ఘాటుగా స్పందించారు. 49 ఏళ్ల నాటి ఘటనను బీజేపీ మళ్లీ ఎందుకు తిరగదోడుతోందని ప్రశ్నించారు. వాస్తవం గురించి మాట్లాడకుండా బీజేపీ 2047 లేదా 1975 నాటి ఘటనల గురించే మాట్లాడుతోందని విమర్శించారు.
ఒకప్పుడు రాజ్యాంగంలో అంతర్గత ఎమర్జెన్సీ విధింపునకు అవకాశం ఉండేదని, కాబట్టి అప్పట్లో ఆ నిర్ణయం రాజ్యాంగ బద్ధమేనని అన్నారు. ప్రస్తుతం దాన్ని తొలగించారని అన్నారు. కాబట్టి, చట్టపరంగా చూస్తే ద్రౌపది ప్రసంగంలో ఎమర్జెన్సీ రాజ్యాంగ విరుద్ధమనడం సరికాదని అన్నారు.
బ్రిటిష్ నుంచి భారత్‌కు అధికారం బదలాయింపునకు చిహ్నంగా ఉన్న సెంగోలు బదులు రాజ్యాంగం కాపీని తీసుకురావాలన్న ఎస్పీ వాదనపై కూడా శశిథరూర్ స్పందించారు. సెంగోల్‌కు అనుకూల ప్రతికూల వాదనలు రెండూ ఆమోదించదగ్గవేనని అన్న ఆయన ఈ విషయంలో తాను తటస్థంగానే ఉండదలచినట్టు వివరించారు.
ఇకపోతే, లోక్‌సభలో విపక్ష నేత బాధ్యతలను తమ పార్టీ అగ్రనేత రాహుల్ తీసుకోవడంపై స్పందిస్తూ, రాహుల్ ఓ నాయకుడిగా ఎదిగారని, ఎంతో పరిణితి చెందారన్నారు. భారత్ జోడో యాత్రలతో పరిస్థితి మారిందన్నారు.
యువత దృష్టి ఆయనవైపు మళ్లిందన్నారు. రాహుల్ తన సూచనలు తీసుకోవాల్సిన అవసరం లేదని, ఆయన నాయకుడిగా మంచి విజయాలు సాధిస్తున్నాడని అన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజల కోసం పనిచేసే అద్భుత అవకాశం రాహుల్‌కు దక్కిందని పేర్కొన్నారు.